ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గురుపూజోత్సవం: పాఠమే ప్రాణం.. బడితోనే బంధం - టీచర్స్​ డే స్పెషల్​

తరగతి గది... మొదటి గంటకు, చివరి గంటకు మధ్య ప్రతి క్షణం క్రియాశీలకంగా ఉండాలి. చదువు.. మెదడుకే కాదు... హృదయానికీ హత్తుకోవాలి. అపుడే బాలలు ముచ్చట‘బడి’ వస్తారు. ఇందుకు కావలసినది ఉపాధ్యాయుని సన్నద్ధత. గురువు పాదరసంలా చురుగ్గా ఉండాలి. విద్యార్థి మనసు పట్టుకోవాలి. నేర్చుకొనే చిన్నారికి గురువు గూగుల్‌ కన్నా ఎక్కువ. ఆసక్తే అర్హతగా విద్యార్థులు..నేర్వాలనే ఆ శక్తిని అందించడమే లక్ష్యంగా గురువు, చదువుల గుడిలో కలిసిమెలిసిపోవాలి.  బడే లోకంగా, బోధనే వ్యాపకంగా ఉపాధ్యాయులు పాఠశాల లక్ష్యాన్ని సుసంపన్నం చేయాలి. కరోనా కట్టడిలో పాఠశాలలకు తాళాలు పడినా.. బోధన సవాలుగా మారినా.. ఆన్‌లైన్‌ బళ్లో చదువుల లోగిలి అర్థవంతంగా ఉండాలి. వినయంతో, బాధ్యతతో అభ్యసిస్తే  విద్యార్జనలో సాంకేతికత చక్కటి సాధనం అవుతుంది. ఆధునిక కాలంలో ఎన్ని రకాల ప్రభావాలు చదువరిని చుట్టుముట్టినా క్రమశిక్షణ మాత్రమే భవితకు బాటలు వేయగలదన్నది వాస్తవం. గురుశిష్యుల బాధ్యత చదువుల లోగిట్లో తు.చ తప్పకుండా అమలైతే అబ్దుల్‌ కలాం ఆశించినట్టు జ్ఞాన సమాజం పల్లె నుంచి ప్రపంచానికి విస్తరిస్తుంది. గురుపూజోత్సవ వేళ... అంకితభావంతో తమ వృత్తికే వన్నె తెచ్చిన కొందరు ఉపాధ్యాయుల స్ఫూర్తిదాయక పయనంపై ప్రత్యేక కథనం...

teachers-day-special-story
గురుపూజోత్సవం

By

Published : Sep 5, 2020, 7:38 AM IST

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో
భూమిని చూసి ఓర్పు నేర్చుకో
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో
ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో
- డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

‘తరగతి గదిలోనే పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్న’ పెద్దలు మాటలను కొందరు ఉపాధ్యాయులు అక్షరాలా నిజం చేస్తున్నారు. ఏదో వచ్చాం వెళ్లాం.. అని కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని కొందరు యువ ఉపాధ్యాయులు తమ వృత్తిపై అంకితభావం చూపుతూ.. పిల్లలను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తాము పనిచేస్తున్న బడుల్లో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ.. పాఠశాల అభివృద్ధికి, పిల్లల పురోభివృద్ధికి పాటుపడుతున్నారు. ఎంతోమంది చిన్నారులను విజేతలుగా నిలుపుతున్నారు. గ్రామస్థుల మన్ననలూ పొందుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి కొంతమంది ఉపాధ్యాయుల వినూత్న పనితీరుపై ప్రత్యేక కథనమిది..

ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ ఆదర్శ పాఠశాలలో పీజీటీగా పనిచేస్తున్న జి.ఆదిత్య 2013 జూన్‌ 19న ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. గత విద్యా సంవత్సరంలో అప్పటి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విద్యార్థుల హాజరు మాసోత్సవాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక్కసారి కూడా సెలవు పెట్టని ఆదిత్య గురించి తెలుసుకొని అప్పటికప్పుడు ప్రశంసాపత్రాన్ని మెయిల్‌లో పంపారు. ఆదిత్య తన ఆంగ్లం సబ్జెక్టులో బృంద చర్చలను నిర్వహిస్తున్నారు. దాంతో ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. ఆయన బోధించే ఆంగ్లంలో ఏటా 100 శాతం ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షల సమయంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడిందని పూర్వ విద్యార్థులు చెబుతుంటారు. ఆర్జిత సెలవులు (ఈఎల్స్‌) ఇచ్చేది లేదని అధికారులు చెప్పినా 2018, 2019 వేసవి సెలవుల్లోనూ ఆదిత్య పనిచేశారు.

బడి ఉన్న మారుమూల పల్లెలోనే నివాసం

ఈ ఉపాధ్యాయుడి పేరు కడేర్ల రంగయ్య. ప్రస్తుతం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన 2010లో ఉపాధ్యాయుడిగా ఎంపికైన నాటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఆయన చేరినప్పుడు 50 మంది విద్యార్థులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 280కి చేరింది. చుట్టుపక్కల 8 గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేలా పాఠశాలను తీర్చిదిద్దారు. సొంతూరు 65 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో 2013లో భార్య వీణతో వచ్చి కెరమెరిలో మకాం పెట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవడంతో ఆయన భార్య వీణ కూడా వేతనం లేకుండా ఉపాధ్యాయురాలిగా మారారు. తమ కుమార్తెను అదే బడిలో చేర్పించారు. బడికి సొంత ఖర్చుతో రంగులు వేయడంతోపాటు ఫర్నిచర్‌ కొన్నారు. క్రమేణా పిల్లల సంఖ్య పెరిగింది. గ్రామస్థులు సైతం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ పది సంవత్సరాలల్లో 40 మంది విద్యార్థులు గురుకులాలు, నవోదయ తదితర పాఠశాలల్లో సీట్లు సాధించారు. అందుకే ఈ యువ ఉపాధ్యాయుడి పేరు ఇటీవల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రాష్ట్రం నుంచి ఆరుగురి పేర్లతో పంపిన జాబితాలో చోటుచేసుకుంది.

ఇస్రోకి పంపిస్తున్నారు

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్‌ ఫెయిర్లు, ఇస్రో పోటీల్లో ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. అందుకు కారణం ప్రధాన ఉపాధ్యాయుడు కర్ర అశోక్‌రెడ్డి. ఆయన ప్రోత్సాహం, మార్గదర్శకంలో విద్యార్థులు రాణిస్తున్నారు. 2018-19లో శ్రీకాంత్‌ అనే విద్యార్థి చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపికైంది. అతను ఇస్రో యువ శాస్త్రవేత్త కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ ఏడాది శివానిశ్రీ అనే విద్యార్థిని అదే కార్యక్రమానికి ఎంపికైంది (అయితే కరోనాతో శిక్షణ వాయిదాపడింది). ఈ బాలిక తయారు చేసిన కలుపు నివారణ యంత్రం గీతం సైన్స్‌ ఫెయిర్‌, తెలంగాణ ఇంటింటా ఇన్నోవేటర్స్‌ పోటీలకూ ఎంపికైంది. అనిల్‌ అనే విద్యార్థి వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటే అప్రమత్తం చేసే అలారాన్ని రూపొందించగా, అది దక్షిణ భారత స్థాయి శాస్త్ర ప్రదర్శనకు ఎంపికైంది. దాదాపు 20 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. ఇక్కడి విద్యార్థులు సైన్స్‌ ఫెయిర్‌ కోసం 300 ఎగ్జిబిట్లు తయారు చేయడం విశేషం. అంతేకాదు డ్రాయింగ్‌లోనూ ప్రతిభ చూపుతున్నారు.

రోజూ గంట ముందుగా బడికి...

సాధారణంగా జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఉదయం 9.30 గంటలకు తరగతులు మొదలవుతాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో మాత్రం ఉదయం 8.45 గంటలకే ఓ ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తూ కనిపిస్తారు. ఆయన పేరు జాడి రాజన్న. రోజూ గంట ముందుగా వెళ్లి ప్రత్యేక తరగతి తీసుకుంటారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఈ 22 ఏళ్లలో ఏనాడూ ఆయన బడికి ఆలస్యంగా వెళ్లలేదు. ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఎన్నడూ ఈ నియమం తప్పలేదు. బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు తెలుసుకొని మళ్లీ రప్పిస్తుంటారు. అందుకే ఆయన పనిచేసిన కొత్తూరు, ఉడుంపూర్‌, కవ్వాల్‌, ఇప్పుడు పనిచేస్తున్న ఉట్నూరు పాఠశాలల్లోని పూర్వ విద్యార్థులు 2015 నుంచి ‘రాజన్న సర్‌ స్టూడెంట్స్‌’ పేరిట వాట్సప్‌ గ్రూపు నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉడుంపూర్‌ ప్రాథమిక పాఠశాలలో 2000లో 50 మంది పిల్లలు ఉండగా దాన్ని ప్రాథమికోన్నత, తర్వాత ఉన్నత పాఠశాలగా మార్చారు. ఇప్పుడు అక్కడ 220 మంది చదువుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు దాతలు, గ్రామస్థులు ఇచ్చిన విరాళాలతో విద్యానిధిని ప్రారంభించారు. బడిలో నమోదుకాని.. అర్ధంతరంగా బడి మానేసిన 175 మంది పిల్లలను గుర్తించి మళ్లీ చదువుబాట పట్టించారు.

నాలుగేళ్ల క్రితమే యూట్యూబ్‌ ఛానెల్‌

కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పుడు టీవీ పాఠాలు.. ప్రత్యేకంగా యూట్యూబ్‌ ఛానెల్‌.. వర్క్‌ షీట్ల గురించి రాష్ట్రంలో విస్తృతంగా చర్చ సాగుతోంది. వీటిని ఓ మారుమూల పల్లెలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొద్ది సంవత్సరాల క్రితమే తాను పనిచేసే పాఠశాలలో ప్రవేశపెట్టారంటే ఆశ్చర్యం వేయక మానదు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం పాఠశాలలో పనిచేస్తున్న రామటెంకి శ్రీనివాస్‌ తన వినూత్న ఆలోచనలతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకూ ఏకరూప దుస్తులు ఉండాలని తోటి ఉపాధ్యాయులను ఒప్పించి 2005 నుంచే అమలు చేస్తున్నారు. సర్కారు బడుల్లో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు ఎందుకు ఉండరాదని ఆలోచించి అమెరికాలో ఉంటున్న తన మిత్రుడు రంజిత్‌కుమార్‌ సహకారం కోరారు. ఆయన రూ.70 వేలు ఇవ్వడంతో ల్యాప్‌టాప్‌, ప్రొజెక్టర్‌ను కొన్నారు. 1-8 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులను అలవాటు చేశారు. యానిమేషన్‌ బొమ్మలతో తయారు చేసిన పాఠాలు పిల్లలకు బాగా అర్థమయ్యేవి. 2016లోనే పాఠశాల పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచి 1, 2 తరగతులకు వర్క్‌షీట్లు తయారు చేశారు. అప్పటి కలెక్టర్‌ కర్ణన్‌ వాటిపై శ్రీనివాస్‌తో మాట్లాడి అలాంటివి జిల్లా మొత్తం అమలు చేయాలని ఆదేశించారు. ప్రతినెలా పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించి పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుంటుంటారు.

సొంత ల్యాప్‌టాప్‌ తీసుకెళుతూ..

ఆమె ఏ పాఠశాలలో పనిచేసినా బడి నిర్వహణ, అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను, చుట్టుపక్కల ప్రజలను భాగస్వాములను చేస్తారు. ప్రభుత్వ బడులను ప్రైవేటుతో పోటీగా తీర్చిదిద్దాలన్నా.. సర్కారు బడులు పదికాలాలపాటు మనుగడ సాధించాలన్నా అది తప్పనిసరని నమ్ముతారు. మౌలిక వసతుల కల్పనకు తన మిత్రులు, దాతల సహకారమూ తీసుకుంటారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ తిరుమలగిరి మండలంలోని లాల్‌బజార్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయురాలిగా (ఎస్‌జీటీ) పనిచేస్తున్న నున్నా లతాదేవి పాఠశాల అభివృద్ధికి పాటిస్తున్న విధానమిది. కేవలం మౌలిక వసతులు ఉంటేనే తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారని ఆమె అనుకోలేదు. అందుకే బోధనలోనూ వినూత్న శైలిని అలవరుచుకున్నారు. పజిల్స్‌, ఆటపాటలతో పిల్లలు విద్య నేర్చుకునేలా చేస్తారు. తరచూ తన సొంత ల్యాప్‌టాప్‌ను బడికి తీసుకు వెళతారు. ముఖ్యంగా పర్యావరణం, పరిసరాల విజ్ఞానం (ఈవీఎస్‌) సబ్జెక్టులో భాగంగా అవయవాల పనితీరు లాంటి వాటి గురించి అర్థమయ్యేలా చెప్పేందుకు యూట్యూబ్‌, ఇతర పోర్టళ్లలోని వీడియోలు చూపుతూ బోధిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న లాల్‌బజార్‌ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు అత్యంత పేదవాళ్లే.. పనిదినాల్లో వారంతా కూలి పనులకు వెళ్తుండటంతో విద్యా కమిటీ సమావేశాలకు హాజరయ్యేవారు కాదు. అందుకే తరచూ ఆమె ఆదివారాల్లోనే ఈ సమావేశాలు నిర్వహిస్తుంటారు.

ఇవీ చూడండి: ఆన్​లైన్​ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details