ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన హోరు - ఇసుక కొరతపై తెదేపా ఆందోళన

ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగారు. పలుచోట్ల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

tdp

By

Published : Oct 25, 2019, 3:03 PM IST

ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన హోరు

ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది కార్మికులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని తెదేపా నేతలు ఆరోపించారు.

విశాఖపట్నం జిల్లాలో...
ప్రభుత్వ ఇసుక విధానం వల్ల వేలమంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద.. తెలుగుదేశం మహాధర్నా చేపట్టింది. బంగారం తరహాలో మెడలో ఇసుక హారాలు వేసుకుని నేతలు వినూత్న నిరసన చేశారు. ధర్నాలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, గణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణలు పాల్గొన్నారు.

భీమునిపట్నం తెలుగుదేశం కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నినాదాలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పార్లమెంట్‌ బాధ్యుడు గంటి హరీష్‌మాథుర్‌, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో...
విజయవాడ భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద తెలుగుదేశం నేతలు కనకమేడల, దేవినేని, బోండా ఉమ ధర్నా నిర్వహించారు. ఇసుక ఉచితంగా ఇచ్చి భవననిర్మాణ రంగాన్ని కాపాడాలని వారు డిమాండ్‌ చేశారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా నరసరావుపేట, తెనాలిలోనూ.. తెలుగుదేశం నాయకులు భవన నిర్మాణ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో...
ప్రభుత్వ ఇసుక సరఫరా విధానాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెలుగుదేశం, సీపీఐ ఆధ్వర్యంలో.. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు జిల్లాలో..
ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఇసుక కొరతకు నిరసనగా... కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల నుంచి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వరకు ట్రాక్టర్లతో తెదేపా పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసనకు దిగారు. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇసుక విధానాలకు వ్యతిరేకంగా తెదేపా ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ ధర్నాలో పాల్గొన్నారు.

కడప జిల్లాలో..
జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పాలవుతున్నారని కడప తెదేపా ఇన్​చార్జ్​ అమీర్​బాబు ధ్వజమెత్తారు. ఇసుక విధానాన్ని వెంటనే అమలుపరచాలని కోరుతూ కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్షలు చేపట్టారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుని... ఉచిత ఇసుక విధానం ఏర్పాటు చేసి... భవన నిర్మాణ కార్మికులతో పాటు అనుబంధ సంస్థలను ఆదుకోవాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా ఆధ్వర్యంలో సామూహిక నిరసన ర్యాలీ చేపట్టారు.

చిత్తూరు జిల్లాలో..
ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా...చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు ఆర్డీవో కార్యాలయల ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాప్ మాజీ అధ్యక్షులు మోహన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పోర్లుదండాలు పెడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.

అనంతపురం జిల్లాలో..
'కావాలి ఇసుక.. పోవాలి ఇసుక మాఫియా' నినాదంతో తెదేపా శ్రేణులు పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారది అధ్యక్షతన ధర్నాకు దిగారు.

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఇసుక ప్రజలకు అందుబాటులోకి తేవాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి పరసారత్నం.. ఆర్డీవో సరోజినికి వినతిపత్రం సమర్పించారు.

విజయనగరం జిల్లాలో...
రాష్ట్రంలో ఇసుక కొరతపై విజయనగరంలో తెదేపా శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన దీక్ష చేపట్టాయి. జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఆధ్వర్యంలో విజయనగరం డివిజన్ కు చెందిన పలువురు తెదేపా నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి..ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
ఇసుక కొరత తీర్చాలంటూ తెదేపా ఆధ్వర్యంలో సామూహిక నిరసన తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని గోపాలపురం ఎమ్మెల్యే.. ముప్పిడి వెంకటేశ్వర రావు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి;

ఎంపీ సుజనాచౌదరితో వల్లభనేని వంశీ భేటీ

ABOUT THE AUTHOR

...view details