రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ ఇచ్చిన సమాధానాన్ని ఉదహరిస్తూ.. సీఎంకు లేఖ రాశారు. లోపభూయిష్టమైన ఇసుక విధానం వల్లే మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే కారణం..
ఇసుక సరఫరాతో పాటు, డ్రైనేజీ, రహదారి నిర్మాణం, ఎన్‌డీఆర్ఎఫ్ క్యాంపస్‌ను మార్చడం వంటి పనులు ఆలస్యానికి ప్రభుత్వ అలసత్వమే కారణమని లోకేష్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి సమాధానంతో ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం ఎంత ప్రభావితమయ్యిందో మరోసారి బయటపడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకే ఇసుక సరఫరా కాకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం రాష్ట్రానికి లభించిన మంచి అవకాశమని పేర్కొన్నారు. త్వరితగతిన పూర్తి చేస్తే ఎంతో మందికి మేలు జరగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు నిర్మాణానికి ఆటంకంగా మారాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు.
ఇదీ చదవండి:
విజయవాడలో వైద్యుల రిలే నిరాహార దీక్ష