రాయపాటి సాంబశివరావు ఇంట్లో జరిగిన సోదాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించాలన్న వైకాపా నేత జోగి రమేశ్ వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. బెయిల్ రద్దు కోరుతూ జగన్‌తో న్యాయస్థానానికి లేఖ రాయించే ధైర్యం ఉందా అని వైకాపా నేత జోగి రమేశ్‌ను ప్రశ్నించారు. ఏ1 జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి అవినీతి సంపాదనలో జోగిరమేశ్, ఇతర వైకాపా నేతలకూ వాటా ఉందా అని నిలదీశారు.
అవినీతి కేసుల విచారణ 6 నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డితో లేఖ రాయించగలరా అని సవాల్ చేశారు. జోగి రమేశ్ ఆ పని చేయిస్తే... తామూ చంద్రబాబుతో సీబీఐకి లేఖ రాయిస్తామని స్పష్టం చేశారు. తమ సవాల్ కు వైకాపా నేతలు సిద్ధమైతే అధికారపార్టీ సవాల్ కు తామూ సిద్ధమేనని ప్రకటించారు.