సీఎం జగన్... ఎంపీ విజయసాయి రెడ్డిని కారు దిగమన్న దగ్గర నుంచి వైకాపాలో పరిస్థితులు మారాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. విశాఖలో విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించాయని అన్నారు. సామాజిక మాధ్యమాల వ్యవహారాలే చూస్తానని ఆయన అనడంపై వైకాపాలో విజయసాయి నెంబరు 2 కాదని తెలుస్తోందన్నారు. వైకాపాలోనే ఉంటానని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారిని ఎంపీ వెనకేసుకురావడం అవివేకమని అశోక్ బాబు విమర్శించారు. ఎస్ఈసీ, రంగుల జీవోలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులపై వైకాపా నాయకులు లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారన్నారు. 151 సీట్లు ఉన్నంత మాత్రాన రాజ్యాంగానికి అతీతులు కారని, ఎంతటి వారైనా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలని హితవు పలికారు.