ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2022, 5:08 AM IST

ETV Bharat / city

గవర్నర్‌.. గో బ్యాక్‌ నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ

TDP MLAs and MLCs protest in assembly: బడ్జెట్‌ సమావేశాలు తొలి రోజు వాడీవేడిగా జరిగాయి. గవర్నర్‌ గో బ్యాక్‌  అంటూ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేసిన నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. నిరసనలు, ఆందోళనల మధ్యే కొంత సమయం పాటు గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారివైపు చూస్తూ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంతో మార్షల్స్‌ రంగ ప్రవేశం చేసి కొంత మంది తెదేపా సభ్యుల్ని సభ నుంచి బయటకు ఎత్తుకెళ్లారు. సభాపతి ఆదేశాలు లేకుండా మార్షల్స్‌ ఎలా లోపలికి వస్తారంటూ తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

assembly meetings
assembly meetings

TDP MLAs and MLCs protest in assembly: గవర్నర్‌ గో బ్యాక్‌ నినాదాలు.. ప్రసంగ ప్రతులు చించేసి, వెల్‌లోకి దూసుకెళ్లడం వంటి ప్రతిపక్ష తెదేపా సభ్యుల ఆందోళనల నడుమ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. నిరసనలు, ఆందోళనల మధ్యే కొంత సమయం పాటు గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారివైపు చూస్తూ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంతో మార్షల్స్‌ రంగ ప్రవేశం చేసి కొంత మంది తెదేపా సభ్యుల్ని సభ నుంచి బయటకు ఎత్తుకెళ్లారు. సభాపతి ఆదేశాలు లేకుండా మార్షల్స్‌ ఎలా లోపలికి వస్తారంటూ తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు కొంతసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన వెంటనే ఆందోళన

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం ప్రారంభించారు. వెంటనే తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి స్థానాల్లో నిల్చుని నిరసన తెలిపారు. ‘రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌.. గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆయన ఓవైపు ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా మరోవైపు తెదేపా సభ్యులు నినాదాలతో ప్రసంగానికి ఆటంకం కల్పించారు. తెదేపా శాసనసభా పక్ష ఉప నేతలు కె. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీలు నారా లోకేశ్‌, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, బీటీ నాయుడు, అశోక్‌ బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు గో బ్యాక్‌ గవర్నర్‌ నినాదాలతో సభను హోరెత్తించారు. వారంతా వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగ పాఠం ప్రతుల్ని చించి, గాల్లోకి ఎగరేసి నిరసన తెలిపారు. ‘రాజ్యాంగ వ్యతిరేక రాజధాని బిల్లులపై సంతకాలు చేసిన గవర్నర్‌ గో బ్యాక్‌ గో బ్యాక్‌.. శాసన మండలి ఛైర్మన్‌, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లపై దాడులు జరిగితే ఆపలేని గవర్నర్‌ గో బ్యాక్‌ గో బ్యాక్‌.. న్యాయ వ్యవస్థపై దాడి చేసిన వారిని హెచ్చరించలేని గవర్నర్‌ గో బ్యాక్‌ గో బ్యాక్‌’ అంటూ వెల్‌లోనే నిల్చుని పెద్ద పెట్టున నినదించారు. వారి ఆందోళనల నడుమే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు.

ముఖ్యమంత్రి అసహనం.. మార్షల్స్‌ రంగ ప్రవేశం...

తెదేపా సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసనలు, నినాదాలు చేస్తుండగా.. వారివైపు చేతులు చూపిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హావభావాలతోనే అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్షల్స్‌ రంగ ప్రవేశం చేశారు. తెదేపా సభ్యుల్ని వెల్‌లో నుంచి పోడియంపైకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు వలయంలా ఏర్పడ్డారు. ఆ సమయంలోనూ తెదేపా సభ్యులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో మార్షల్స్‌ తొలుత ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణ రాజు, బీటీ నాయుడిని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, ఇతర సభ్యులు మార్షల్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి ఆదేశాలు లేకుండా లోపలికి ఎలా వస్తారని, తమ సభ్యుల్ని ఎలా బయటకు తీసుకెళ్తారని నిలదీశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ‘గవర్నర్‌ గో బ్యాక్‌.. గో బ్యాక్‌’ అనే నినాదాలు చేస్తూ ఉదయం 11.15 గంటలకు సభ నుంచి నిష్క్రమించారు.

ఇదీ చదవండి:వైకాపా వింత పోకడలతో సభ గౌరవం తగ్గిస్తోంది: తెదేపా

ABOUT THE AUTHOR

...view details