పట్టణాల్లో యూజర్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్షం తెదేపా(TDP) హెచ్చరించింది. అధికార పార్టీ అండతోనే మహిళలపై పోలీసుల జులుం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో నాయకులు ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో మహిళా భద్రత గాల్లో దీపంలా మారిందనటానికి ఆదోనిలో హోంగార్డు రామలక్ష్మి, విశాఖలో లక్ష్మీ అపర్ణల ఘటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
సీఐ సురేష్ వేధింపులు కారణంగానే కర్నూలు జిల్లా ఆదోనిలో హోంగార్డు రామలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారని విమర్శించారు. సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను చెప్పుకున్నా బాధ్యులైన పోలీసులపై చర్యలు లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? అని నిలదీశారు. గన్ను కంటే వేగంగా వస్తాడన్న జగన్ ఎక్కడని ప్రశ్నించారు. విశాఖలో కొవిడ్ వారియర్ లక్ష్మీ అపర్ణ అనే యువతి పట్ల పోలీసుల తీరు అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ సమయంలో బయటకు వెళ్లేందుకు అన్ని పత్రాలు ఉన్నా ఆమెను అడ్డుకుని అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ప్రశ్నించే వారిపై పోలీసుల ద్వారా వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సిమెంటు, స్టీలు, ఇసుక ధరలు నాలుగు రెట్లు పెరిగిన తరుణంలో గృహనిర్మాణ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీని పెంచకపోగా లక్ష నుంచి 30వేలకు తగ్గించటం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆప్షన్ను లబ్ధిదారులంతా ఎంచుకుంటే ఆ ఆప్షన్ ను ఎందుకు తొలగించారని దుయ్యబట్టారు. కనీస మౌలిక సౌకర్యాలు లేకుండా ఇళ్ల నిర్మాణంపై ఒత్తిడి తేవటం తగదన్నారు.