TDP on YSRCP: నవరత్నాల పేరిట నవ మోసాలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది రూ.లక్షన్నర కోట్లేనని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. తెచ్చిన రూ. 5 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్లీనరీలో ఆత్మస్తుతి పరనింద తప్ప ప్రజోపయోగం శూన్యమని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ లేదని దుయ్యబట్టారు. 95శాతం మేనిఫెస్టో హామీల అమలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
- అమ్మఒడి కుదింపు, నాన్న బుడ్డీ వసూళ్లతో తొలి రత్నం పక్కకి పోయింది.
- మూడేళ్లు పూర్తైనా 3వేలు కాని పెన్షన్‌తో రెండో రత్నం ఔటయ్యింది
- రైతు భరోసా రూ.13,500 బదులు రూ.7,500 ఇస్తూ మూడో రత్నానికి చెక్ పెట్టారు.
- ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేసి 4వ రత్నం ఎగ్గొట్టారు.
- జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞానికి తెరలేపి ఐదో రత్నం మాయం చేశారు.
- ప్రీ పెయిడ్ విధానంతో ఆరోగ్య శ్రీ అనే ఆరో రత్నానికి చిల్లు పెట్టారు.
- ఉచితంగా పక్కా ఇళ్లు హామీకి తిలోదకాలిచ్చి.. 7వ రత్నాన్ని ఎగ్గొట్టారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 6 లక్షల మందిని ఎగ్గొట్టి.. 8వ రత్నానికి చిల్లు పెట్టారు.
- మందు బాబుల్ని తాకట్టు పెట్టి 33వేల కోట్లు అప్పు తెచ్చి నవరత్నానికి మంగళం పలికారు.
ఆ అర్హత వైకాపాకు లేదు: వైకాపాకు... రైతు దినోత్సవం నిర్వహించే అర్హత లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్లలో రైతుల్ని ప్రభుత్వమే ముంచేసిందని విమర్శించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను సైతం ఈ ప్రభుత్వం నిలుపుదల చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి జరిగిన కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.