ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచర పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే.. అక్రమ కేసులు పెడుతున్నారన్న నేతలు.. జగన్ చేయించే దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. బాబు దీక్ష చేపట్టిన మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దీక్షా స్థలి వద్ద, మీడియా సమావేశాల్లో ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.
అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతాం -దేవినేని ఉమా, మాజీ మంత్రి
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేశారు, పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్ తో దాడి చేశారు. దాడులు చేస్తే భయపడబోమని స్పష్టం చేశారు. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారన్న ఆయన.. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామని పేర్కొన్నారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోప్రజాస్వామ్యానికి దెబ్బతగిలింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలన్నారు.
పచ్చడి అయిపోతారు -పీతల సుజాత, మాజీ మంత్రి
వైకాపా వచ్చాక రాష్ట్రం.. డ్రగ్స్, శాండ్, మైన్, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా మారిందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు అంటకాగుతున్నారని విమర్శించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. కేసులు నుండి తప్పించుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులు చూపెడితే.. అక్రమ కేసులు పెడుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయకులకు బీపీలు వస్తే కొడతారు.. మా నాయకులు మాములుగా వస్తేనే పచ్చడి అయిపోతారని హెచ్చరించారు.
ఆటవిక పాలనా..? ప్రజాస్వామ్యమా..? - గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మానవ హక్కులను హరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ఆటవిక పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో, బయట వైకాపా నేతలు చంద్రబాబుని తిట్టిన తిట్లేంటని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తుపాకీతో కాల్చాలని, ఉరితీయాలని, ముఖ్యకంత్రీ అని జగన్ రెడ్డి అనలేదా? అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు.
ఇదీ చదవండి :చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?