"అమరావతిలో అసైన్డ్ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి సీఐడీకి తప్పుడు ఫిర్యాదులిచ్చి, కోర్టుల్ని తప్పుదోవపట్టించిన ఎమ్మెల్యే ఆళ్ల, సూత్రధారి సీఎంపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి" అని... తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సీఎం జగన్, తన గ్యాంగ్ ప్రజారాజధానిపై పగబట్టారని మరోసారి సాక్ష్యాధారాలతో వెల్లడైందన్నారు. కూలగొట్టడమే కానీ, కట్టడం రాని జగన్... ప్రజావేదికతో ఆరంభించిన విధ్వంసం అమరావతి వరకూ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
22 నెలల పాలనలో ప్రజారాజధానిపై పదుల సంఖ్యలో విచారణలు జరిపించిన సీఎం, ఒక్క అక్రమంగానీ, ఒక్క రూపాయి అవినీతిని గానీ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి తన డీఎన్ఏలో భాగమైన ఫేక్ ప్రచారాస్త్రం తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ రైతుల పేరుతో మంగళగిరి ఎమ్మెల్యే కిరాయి మనిషి జాన్సన్, వాలంటీర్ను.. ఎస్సీ రైతులంటూ సీఐడీకి ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల గుట్టుని తెదేపా రట్టు చేసిందని అచ్చెన్న ట్విట్టర్లో దుయ్యబట్టారు.
"అసత్య ప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారం కూలిపోయే రోజు దగ్గర పడింది" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకుపోయిన బుద్ధి ఇంకా మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతీ మాట, వేసిన ప్రతీ అడుగు తప్పులతో ఇప్పటికే ఫేక్ సీఎం అనిపించుకున్నారని... అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.