ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ షాపుల్లో విక్రయించే మద్యంలో విషం!

రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న 3 రకాల బ్రాండ్లలో విషపూరిత, హానికరమైన రసాయనాలు ఉన్నట్లు తెదేపా వెల్లడించింది. ఆంధ్రాగోల్డ్‌, 9 సీహార్స్‌, సిల్వర్‌ స్ట్రైప్స్స్‌ విస్కీ నమూనాల్ని పరీక్షిస్తే వెల్లడైనట్లు పేర్కొంది. ఈ మద్యం వల్ల భావితరాల్లో జన్యుపరమైన సమస్యలు.. అనేక అనారోగ్యాల వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు తెదేపా నాయకులు.

spurious-liquor
మద్యంలో విషం

By

Published : Jun 26, 2022, 5:46 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్‌, ఐసోఫులెరిక్‌ యాసిడ్‌, డైఇథైల్‌ థాలేట్‌ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది. ఈ మద్యం తాగినవారు మతిభ్రమించి భ్రాంతిలో ఉంటారని, నరాలన్నీ లాగేస్తున్నట్లు, మెదడులోనూ, ఒళ్లంతా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుందని తెలిపింది. నాడీవ్యవస్థ పనితీరు పెరిగిపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.

భావి తరాల్లో జన్యుపరమైన సమస్యలకు కారణమై వైకల్యం, అంధత్వం వంటివాటికి దారితీసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ అంగవైకల్య ప్రదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఆ నమూనాల్ని చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రయోగశాలలో పరీక్ష చేయించింది. ఆ ప్రయోగ ఫలితాలు, నివేదికల్ని శనివారం మీడియాకు విడుదల చేసింది. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రసాయన నిపుణుడు, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ కలిసి విలేకరులతో మాట్లాడారు.

తాగితే చనిపోతారని తెలిసే వ్యాపారం..అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఈ మద్యాన్ని తాగితే ప్రజలు భయంకరమైన వ్యాధులతో చనిపోతారని తెలిసి కూడా ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేదు. ప్రజల చావులతో సీఎం జగన్‌ వ్యాపారం చేస్తున్నారు. కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఎక్కడా చూడలేదు. ఈ విష రసాయనాలతో కూడిన మద్యం పురుషులు తాగటం వల్ల మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయి. కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి తెగబడటం, 60-70 ఏళ్ల వృద్ధుడు చిన్నారులపై బలాత్కారాలు చేయటం వంటి నేరాలకు ఈ విష రసాయనాలు కలిగిన బ్రాండ్లు తాగటమే కారణమవుతోంది. అయినా సరే ఐఏఎస్‌ అధికారులు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు.

రజత్‌ భార్గవా... ఇప్పుడే ఏమంటారు
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లలో విష రసాయనాలు ఉన్నాయని గతంలోనే మేం బయటపెట్టాం. అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఆ నమూనాలు ఆంధ్రప్రదేశ్‌లో నుంచి సేకరించినవేనని ఎలా చెబుతారు? కొన్న తర్వాత వాటిలో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. అందుకే గుత్తి, చిలకలూరిపేట, అనపర్తి సహా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ర్యాండమ్‌గా కొనుగోలు చేసి నమూనాలు సేకరించాం. జియోట్యాగింగ్‌ కూడా చేశాం. (ఆయా ప్రాంతాల్లోని దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసిన వీడియోలు ప్రదర్శించారు). వాటిని మేము ల్యాబ్‌లో పరీక్షిస్తే.. ప్రాణహాని కలిగించే విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. గత రెండేళ్లలో అనేక మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వైరస్‌ వల్ల వారి ఊపిరితిత్తులు ఇప్పటికే బలహీనపడ్డాయి. రోగనిరోధక శక్తి తగ్గింది. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రమాదకర రసాయనాలు కలిగిన మద్యం తాగితే అది మరింత ప్రాణాంతకం అవుతుంది. మా పరీక్షల్లో తేలిన అంశాలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే.. ఆ బ్రాండ్లు సురక్షితమేనని వచ్చి ప్రకటించాలి. ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలి.

త్వరలో జగనన్న సారాయి యాప్‌.. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో లభిస్తున్న బ్రాండ్లన్నీ జగన్‌రెడ్డి, ఆయన బంధువులు, వారి పెట్టుబడిదారులు తయారు చేయిస్తున్నవే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న రెగ్యులర్‌ బ్రాండ్లు ఇక్కడ ఎందుకు అమ్మట్లేదో జగన్‌ సమాధానం చెప్పాలి. త్వరలో జగనన్న సారాయి యాప్‌ను కూడా తీసుకొస్తారనుకుంటా. జనం సారా తాగకపోతే అందులో అప్‌లోడ్‌ చేయాలని వాలంటీర్లకు నిబంధన పెట్టినా పెడతారు. అక్రమ మద్యం అమ్ముకునేందుకే ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు పెట్టట్లేదు.

  • పరీక్షించిన బ్రాండు-1: ఆంధ్రా గోల్డ్‌ విస్కీ
    కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్‌, ఐసోఫులెరిక్‌ యాసిడ్‌
    తాగితే వచ్చే పరిణామాలు:దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం, శ్వాసక్రియ ఒక్కసారిగా పెరిగిపోవటం, రక్తపోటు తగ్గిపోవటం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతమవ్వటం, తలతిరగటం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగటం, మూర్ఛపోవటం లాంటి సమస్యలు వస్తాయి.
  • పరీక్షించిన బ్రాండు-2: సిల్వర్‌ స్ట్రైప్స్స్‌ విస్కీ
    కనుగొన్న విష రసాయనాలు:పైరోగలాల్‌, ఐసోఫులెరిక్‌ యాసిడ్‌, డై ఇథైల్‌ థాలేట్‌
    తాగితే వచ్చే పరిణామాలు: చేతులు, అరికాళ్ల కింద సూదులతో గుచ్చినట్లు ఉండటం, జన్యుపరమైన సమస్యలు, కళ్ల మంటలు, చర్మంపై దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
  • పరీక్షించిన బ్రాండు-3: 9 సీహార్స్‌ విస్కీ
    కనుగొన్న విష రసాయనాలు:పైరోగలాల్‌, ఐసోఫులెరిక్‌ యాసిడ్‌, డై ఇథైల్‌ థాలేట్‌
    తాగితే వచ్చే పరిణామాలు: శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, కళ్ల మంటలు, చర్మంపై దురద, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటివి
  • వెలుగుచూసిన విష రసాయనాలు..
    పైరోగలాల్‌: ఇది విషపూరితం. దీన్ని తాగటం, పీల్చటం అత్యంత ప్రమాదకరం. జన్యుపరమైన సమస్యలకు కారణమవుతుంది.
    డై ఇథైల్‌ థాలేట్‌:ఈ రసాయనం కలిగిన మద్యం తాగితే తిమ్మిరి ఎక్కుతుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటుంది.
    ఐసోఫులెరిక్‌ యాసిడ్‌:ఈ రసాయనాన్ని పరిశోధనల్లోనే ఉపయోగిస్తారు. మనుషులు, జంతువుల వైద్య అవసరాలకూ ఉపయోగించకూడదు. ఇది శ్వాసపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది.

ఇదీ చూడండి:ఉద్యోగం పేరుతో యువతిని నమ్మించి వేధింపులు.. ఒకరి అరెస్టు..

'వెనుకబడిన వర్గాల హక్కుల్ని సీఎం జగన్ హరిస్తున్నారు..'

ABOUT THE AUTHOR

...view details