KANAKAMEDALA: మహానాడుకు వచ్చిన స్పందన, వైకాపాపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి భయపడి.. సీఎం జగన్ పార్టీ నేతలతో వర్క్ షాపు నిర్వహించారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకోవడానికే ఈ వర్క్ షాపు, ప్లీనరీలని మండిపడ్డారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆ పార్టీ శాసనసభ్యులు ప్రజలపై దాడులు చేశారన్నారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు, సమస్యలకు సమాధానాలు చెప్పలేక పోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వర్క్ షాపులో శాసనసభ్యులు లేవనెత్తిన సందేహాలకు.. సీఎం జగన్ సమాధానాలు చెప్పలేక పోయారని విమర్శించారు. ప్రజల మీద తిరగబడమని.. శాసనసభ్యులను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని.. ప్రజల సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కార మార్గాలు చెప్పలేకపోయారని ధ్వజమెత్తారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన వైకాపా నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని వాదిస్తున్నారని విమర్శించారు . ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న గంగాధర్ అనుమానాస్పదంగా మృతి చెందారన్నారని.. పరిటాల హత్యకేసులో సాక్షులు చనిపోయారని వెల్లడించారు. అదే పంథా వివేకానంద రెడ్డి కేసులో జరుగుతుందనే అనుమానం ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5.18శాతం భౌతిక దాడులు పెరిగాయని..సెంట్రల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు. గంజాయి సరఫరాలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలలో ఒక పోస్టు పెడితే.. ఒక మహిళా నేతను 8 గంటలు ప్రశ్నిస్తారు.. అదే ఒక దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి తీసుకువచ్చి శవాన్ని తీసుకోవాలని బలవంతపెట్టిన నాయకుడిపై కేసు నమోదు చేయడానికి రెండు రోజులు తీసుకుంటారా అని మండిపడ్డారు. చట్టం చుట్టమై వైకాపా నేతలను రక్షిస్తుందని.. తెదేపా నేతలను శిక్షిస్తుందని ఆగ్రహించారు. తెదేపా నేతలు, మాజీ మంత్రులు చేసిన ఒక్క ఫిర్యాదుపై కూడా పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు.