ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 5:10 PM IST

Updated : Feb 14, 2020, 9:59 PM IST

ETV Bharat / city

'ఐటీ దాడులపై దొంగే... దొంగా దొంగా అన్నట్లుంది'

ఐటీ దాడులను తెదేపాకు అంటగట్టేందుకు వైకాపా నేతలు, మంత్రులు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత దేవినేని ఉమ విమర్శించారు. దొంగే... దొంగా దొంగా అన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడుల నుంచి మంత్రులు, ఎంపీలను కాపాడుకునేందుకు సీఎం జగన్ దిల్లీ పరిగెత్తారని దేవినేని ధ్వజమెత్తారు.

Devineni uma
దేవినేని ఉమామహేశ్వరరావు

తెదేపా కార్యాలయంలో మాట్లాడుతున్న దేవినేని ఉమ

దేశంలో జరుగుతున్న ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టేందుకు వైకాపా విశ్వప్రయత్నం చేస్తుందని... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అవినీతిలో కూరుకున్న జగన్ అందరినీ అందులోకి లాగాలని చూస్తున్నారని విమర్శించారు. ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2 లక్షలు, 12 తులాల బంగారం గుర్తించారని వివరించారు. శ్రీనివాస్ కుమార్తె వివాహం కారణంగా నగదు, బంగారం ఉందన్నారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ దిల్లీ పర్యటన చేస్తున్నారని విమర్శించారు.

హైకోర్టు చివాట్లు పెట్టింది

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సన్నిహితుల సంస్థలపై ఐటీ దాడులు జరిగితే వైకాపా నేతలు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టినప్పుడు జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేఘా సంస్థపై ఆరోపణలు చేశారని... అదే సంస్థకు పోలవరం పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టినందుకు కోర్టులో చివాట్లు తిన్నారని దేవినేని అన్నారు. స్వయంగా డీజీపీ న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితిపై దేవినేని ఉమా

రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి

రాష్ట్రంలో ఆర్థిక అత్యయికస్థితి రాబోతుందని, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. డీఏల గురించి మాట్లాడలేని ఉద్యోగ సంఘాలు, మూడురాజధానుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆర్టీసీ విలీనం అసలు నిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. 7 లక్షల పింఛన్లు, 20 లక్షల రేషన్‌ కార్డులు తీసేసిన ప్రభుత్వం, రీవెరిఫికేషన్‌ పేరుతో నాటకాలు ఆడుతుందని విమర్శించారు. గ్రామవాలంటీర్ల ముసుగులో వైకాపా కార్యకర్తలకు దోచిపెట్టే యజ్ఞాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి :'జైల్లో ఉండి వచ్చిన వారికి అలాగే కనిపిస్తారు'

Last Updated : Feb 14, 2020, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details