రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉండడం సీఎం జగన్ ఘనతేనని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణమాఫీని రైతులకు ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. భరోసా పేరుతో రైతులకు వైకాపా రూ.20వేల కోట్లు మోసం చేశారని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లభించక రూ.15వేల కోట్లు, వైకాపా మోసం వల్ల రూ.20వేల కోట్లు, వరదల్లో పంట నష్టం రూ.15వేల కోట్లు, ఇలా గత 15నెలల్లో మొత్తం రూ.50వేల కోట్లు నష్టపోయారని యనమల వివరించారు.
రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా రావాల్సినవి రద్దు చేశారని విమర్శించారు. రెండు విధాలా రైతులను నష్టాల్లో ముంచి అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ధాన్యం బకాయిలు రూ.300కోట్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వేలాది ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని దుయ్యబట్టారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని పొలాల్లో తిరిగే దుస్థితి రైతులకు పట్టించారని విమర్శించారు.