వైకాపా ఏడాది పాలనలోనే అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆన్లైన్ ద్వారా ఆయన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. మద్యం, ఇసుక, గనులు, భూసేకరణ, కరోనా కిట్లు, బ్లీచింగ్‌లో కుంభకోణాలు జరిగాయన్న చంద్రబాబు... తెదేపా ఛార్జిషీట్‌లో వీటన్నింటినీ బట్టబయలు చేసినట్లు తెలిపారు. తెదేపా హయాంలో పథకాలపై సీబీఐ విచారణ చెయ్యించాలన్న నిర్ణయాన్ని నేతలు ఖండించారు. వైకాపా వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్లీ వీటిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
తప్పులు కప్పిపుచ్చేందుకే...
ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చేందుకే అప్పటి పథకాలకు సీబీఐ విచారణ ముసుగు వేశారని టీడీఎల్పీ నేతలు ఆరోపించారు. పేదలకిచ్చే పండుగ కానుకలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న బీమాపై సీబీఐ విచారణ నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు. వీటిని సక్రమంగా ఉపయోగించడం చేతకాక మూలనపడేసి బురద జల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పథకం నిలిచిపోవడం వల్ల ఏడాదిగా ఎన్నో పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేయడంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీఎల్పీ నేతలు అభిప్రాయపడ్డారు.