TDP chief Chandrababu: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే.. తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. భక్తులకు తాగునీరు, క్యూలైన్లలో నీడ ఉండేలా చూడలేరా అని నిలదీశారు. తితిదే నిర్ణయాలతో శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP chief Chandrababu: దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం తితిదేలో కనిపిస్తోందన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే తితిదే చూస్తోందని విమర్శించారు. కొండపైకి వెళ్లడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని దుయ్యబట్టారు. భక్తులకు తితిదే క్షమాపణలు చెప్పి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తోపులాట: శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద.. భక్తుల రద్దీ పెరగటంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో.. టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలలో తోపులాట జరిగి.. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
భక్తుల ఆవేదన: తాము తిరుపతికి చేరుకుని మూడు, నాలుగు రోజులు అవుతుందని... టోకెన్లు మాత్రం ఇవ్వటం లేదని భక్తులు వాపోతున్నారు. భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కనీసం కొండపైకి కూడా అనుమతించట్లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి అనుమతిస్తే తలనీలాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటామని వాపోతున్నారు. ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని... గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట.. ముగ్గురికి గాయాలు