Chandrababu: రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని... మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో ఈ విషయం మరోసారి రుజువైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని అధికార పార్టీ వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా.. పోలీసులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఒక మహిళ స్పందన కార్యక్రమంలో స్వయంగా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైన కూడా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలని నిలదీశారు. ప్రజల ప్రాణాలు, బాధితుల వేదనల కంటే.. రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ముఖ్యమయ్యాయని దుయ్యబట్టారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
CITU leader suicide: కృష్ణాజిల్లాకు చెందిన సీఐటీయూ నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో.. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత వేధింపులు కారణంగానే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మాసుం బాషా తెలిపారు.
డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళతో ఏర్పడిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని.. అధికార పార్టీ నేతల వేధింపులు లేవని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేస్తామన్నారు. కాగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నాగలక్ష్మి భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ నేత పేర్ని కిట్టు, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:కృష్ణాజిల్లా సీఐటీయూ నాయకురాలు ఆత్మహత్య... అధికార పార్టీ నేత వేధింపులే కారణం?