ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యాశ చూపారు.. ఆరు నెలల్లోనే రూ.156 కోట్లు కాజేశారు! - సీపీ సజ్జనార్ వార్తలు

తమ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేయండి అధిక వడ్డీ ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాలకు డబ్బు మొత్తం కడితే నెల నెలా 10 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తామని చెప్పారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ముగ్గురు కోట్ల రూపాయలు కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 156 కోట్లు స్వాహా చేశారు. వాళ్లెవరో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

swadatri infra schemes cheaters arrest at hyderabad
స్వధాత్రి ఇన్​ఫ్రా చీటర్స్ అరెస్టు

By

Published : Jul 5, 2020, 12:39 PM IST

స్వధాత్రి ఇన్​ఫ్రా చీటర్స్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన రఘు ఎమ్​సీఎ పూర్తి చేశాడు. ఓ బహుళజాతి సంస్థలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశాడు. స్థిరాస్తి వ్యాపారంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. విజయవాడలో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. అక్కడ పలువురిని మోసం చేసిన రఘు... అనంతరం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కి మకాం మార్చాడు. శ్రీనివాస్‌ బాబు అనే మరో వ్యక్తితో కలిసి 'స్వధాత్రి ఇన్‌ఫ్రా' పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు.

కంపెనీ మేనేజర్‌గా మీనాక్షి అనే మహిళను నియమించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. ఏజెంట్లను నియమించి ప్రచారం చేయించారు. ప్రజలను ఆకర్షించేందుకు అధిక వడ్డీలు చెల్లిస్తూ... డిపాజిట్లు రాబట్టారు. కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు కాజేశారు.

తీగలాగితే... డొంక కదిలింది...

స్వధాత్రి ఇన్ఫ్రా, స్వధాత్రి ప్రాజెక్ట్స్, స్వధాత్రి రియల్టర్స్ పేరుతో మూడు స్కీములను ప్రారంభించారు. తమ కంపెనీలో లక్షకు మించి పెట్టుబడి పెడితే ఏడాదిపాటు నెలకు 9శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. దీంతో 950 మంది కస్టమర్లు రూ.87 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. రుసుము లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయించడం... నెలనెలా 10 వేలు వెనక్కివ్వడం... లాంటి పలు పథకాలతో రూ.69 కోట్లు కాజేశారు. మొదట్లో ఒప్పందం ప్రకారం చెల్లించినా.. ఆ తర్వాత సరిగ్గా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేసిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. మూడు స్కీముల్లో మొత్తం 1450 మంది నుంచి రూ. 156 కోట్లు వసూలు చేశారని పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం ఆరు నెలల్లోనే వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అధిక వడ్డీలు ఇవ్వడం బ్యాంకులకే సాధ్యం కానప్పుడు వేరే వ్యక్తులు ఇస్తున్నారంటే ప్రజలు ఆలోచించాలని, మోసాలు చేస్తే తప్ప అది సాధ్యం కాదని పోలీసులు మరోసారి హెచ్చరించారు. కష్టపడిన సొమ్మును అత్యాశతో కోల్పోవద్దని సూచించారు.

ఇవీ చూడండి:టికెటింగ్‌ కంపెనీల ఆదాయం ఫట్‌.. వేతనాల్లో భారీ కోతలు

ABOUT THE AUTHOR

...view details