అమెరికాలో ఫాల్ సీజన్ కింద ఆగస్టులో తరగతులు మొదలవుతాయి. కొన్ని నవంబరు నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తుంటాయి. ఈ ప్రక్రియ వచ్చే మే నెల వరకు కొనసాగుతుంది. గత ఏడాది వెళ్లాల్సిన వారు కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. కొందరు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందారు. కరోనా నేపథ్యంలో కొన్ని యూనివర్శిటీలు ఈసారి జీఆర్‌ఈ స్కోరు లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొందరు విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూరప్ దేశాల వైపు చూస్తున్నారని కన్సల్టెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
25 శాతం పెరిగిన ట్రాన్స్‌స్క్రిప్టులు
రెండు రాష్ట్రాల్లో.. ట్రాన్స్‌స్క్రిప్టులు తీసుకునే వారి సంఖ్య 25-30 శాతం పెరిగిందని జేఎన్‌టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి 5-10 వర్సిటీలకు దరఖాస్తు చేస్తుంటారు. దరఖాస్తుకు ఒరిజినల్ మార్కుల ధ్రువపత్రాలను పొందుపరచలేరు కాబట్టి రిజిస్ట్రార్, పరీక్షల విభాగం అధికారులు సంతకం చేసిన ట్రాన్స్‌స్క్రిప్టులను విద్యార్థులు ఆయా వర్సిటీల నుంచి తీసుకుంటారు. వీటి కోసం ఇప్పటివరకు 7,000 మంది దరఖాస్తు చేశారని జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల కంట్రోలర్ వెంకటరెడ్డి చెప్పారు. ఒక్కో విద్యార్థి 10-15 తీసుకుంటున్నారని, గత ఏడాది కంటే 25 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ నుంచి గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి 15 వరకు 4,745 మంది బీటెక్ విద్యార్థులు, 186 మంది బీఫార్మసీ విద్యార్థులు ట్రాన్స్‌స్క్రిప్టులు పొందారు. వివిధ విదేశీ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోగా తనిఖీ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుంచి తమకు 2,533 సర్టిఫికెట్లు వచ్చాయని పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య కామాక్షిప్రసాద్ చెప్పారు.
అమెరికాలో రెండు లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా తెలంగాణ నుంచి కనీసం 15,000 మంది, ఏపీ నుంచి 10,000 మంది వెళ్తుంటారని అంచనా. వారిలో హైదరాబాద్ నుంచే సుమారు 10,000 మందికిపైగా వెళ్తున్నారు. ఎక్కువమంది స్టెమ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం కోర్సులను చదువుతున్నారు. మన దేశంలో ఒకే నగరం నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్యలో హైదరాబాద్‌దే ప్రథమ స్థానం.
సానుకూల వాతావరణం
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడు ఎప్పుడు తమకు నష్టం చేసే నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడేది. ఇప్పుడు జోబైడెన్ రాకతో సానుకూల వాతావరణం ఏర్పడిందని విద్యార్థులు భావిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి వేగంగా కోలుకుంటుండటంతో ఇప్పుడు వెళితే చదువు పూర్తయ్యే రెండేళ్లలో కొలువులు దక్కుతాయని వారు అంచనా వేస్తున్నారు.
8 వర్సిటీలకు దరఖాస్తు చేశా