రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో... మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించనుంది. ఇప్పటికే ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైనందున... తదుపరి ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నేడు ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉండగా... మధ్యాహ్నం 12 గంటలవరకూ నామపత్రాలు పరిశీలిస్తారు. 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఒంటిగంటలోపు ఉపసంహరణకు అవకాశం ఉండగా... అదే సమయంలో ఎన్నికల అధికారి కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనున్నారు.
ఎంపీపీల ఎన్నిక విషయంలో కొన్నిచోట్ల ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నికలు మలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. గతంలో నామినేషన్ల సమయంలో దుగ్గిరాల-1 ఎంపీటీసీ తెలుగుదేశం, ఈమని-1 ఎంపీటీసీ జనసేన అభ్యర్థుల నామినేషన్లు చెల్లవంటూ వైకాపా అభ్యంతరం తెలిపింది. తెలుగుదేశం, జనసేన ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో వారి నామినేషన్లు చెల్లాయి. ప్రచారం మొదలైన కొన్నిరోజులకే దుగ్గిరాల-1, దుగ్గిరాల-3 అభ్యర్థులు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ నెల 19న జరిగిన లెక్కింపులో జనసేన 63 ఓట్లతో గెలిచిన పెదకొండూరులో రీకౌంటింగ్ చేపట్టాలని వైకాపా పట్టుబట్టింది. మరోసారి లెక్కించి 39 ఓట్లతో జనసేన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వైకాపా మళ్లీ అభ్యంతరం తెలపడంతో 20 ఓట్లతో అధికార పార్టీ గెలిచిందని అధికారులు ప్రకటించారు.