ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎంత మొత్తం ప్రతిపాదించారు వంటి వివరాల్ని ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే వెల్లడిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు 14 రోజులపాటు మెడికల్ క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీకరిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు.
మంత్రి పేర్ని నాని వెల్లడించిన ముఖ్యాంశాలివీ..
లాక్‌డౌన్ వల్ల ఆక్వా పరిశ్రమ ఇబ్బంది పడకుండా చర్యలు. మేత, మందుల సరఫరా, చెరువుల నుంచి సరకు ప్రాసెసింగ్ ప్లాంట్లకు, అక్కడి నుంచి కంటెయినర్లలో నౌకాశ్రయాలకు పంపించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఆదేశం. ఆక్వా ఎగుమతిదారులు, పరిశ్రమ వర్గాలతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించాల్సిందిగా మంత్రి మోపిదేవి వెంకటరమణకు సూచించిన సీఎం.
- కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్ల వద్ద రూ.2 కోట్లతో అత్యవసర నిధి.
- ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ ప్రస్తుతం పని కల్పించాలి. వారు నిర్దేశిత దూరాన్ని పాటించేలా చూడాలి.
- ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు ఆదుకోవాలి
- రోడ్లపైనా, చెట్ల కిందా కాలం గడిపే బిచ్చగాళ్లు, అనాథలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి, సొంతూళ్లకు వెళ్లే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నవారి కోసం... స్థానికంగా కల్యాణ మండపాల్ని అద్దెకు తీసుకుని వసతి, భోజన సదుపాయం కల్పించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం.
- ఉండటానికి గూడున్నా, భోజనానికి ఇబ్బంది పడుతున్నవారిని గుర్తించి ఆహారం అందించే ఏర్పాట్లు. వారికి సాయం చేసేందుకు ఆర్థిక స్థోమత ఉన్నవారు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి.
- ఎవరూ ముందుకు రాకపోయినా ప్రభుత్వమే ఆ బాధ్యత నిర్వహిస్తుందని వెల్లడి.