రాష్ట్రంలో తొలిసారి ఓ శాసనసభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి వైకాపా తరఫున గెలిచిన కడుబండి శ్రీనివాసరావుకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. గత రెండు మూడు రోజులుగా ఆయన ఆనారోగ్యం బారిన పడగా..పరీక్షించిన వైద్యులు వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఈనెల 10న అమెరికా నుంచి రాక
ఈనెల 10న అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ అని తేలడంతో... హైదరాబాద్, అమరావతి, విశాఖ, విజయనగరంలో పలువురు అధికారులు, వ్యక్తులను కలిశారు. తన సొంత నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించారు. అమెరికా నుంచి వచ్చిన ఆయన్ను...మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు..
బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనని శ్రీనివాసరావు...తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్నారు. అనంతరం చాలామంది ప్రజాప్రతినిధులు, అధికారులను కలిశారు. తిరిగి విజయనగరానికి వచ్చిన ఆయన స్వచ్ఛందంగా ట్రూనాట్ పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో కరోనా లక్షణాలు కనిపించడంతో...స్వాబ్ పరీక్షలు చేయటంతో పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కొవిడ్ బారిన పడిన ఆయన...విశాఖలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఐసోలేట్ అయినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన గన్‌మెన్‌కు పరీక్షలు జరపగా...వైరస్ సోకినట్లు తేలింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను క్వారంటైన్ చేసి కరోనా చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందరి నమూనాలను సేకరించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రైమరీ కాంటాక్ట్స్‌పై కూడా అధికారులు అరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:
రాజకీయ పోస్టులు ఫార్వర్డ్.. ఇద్దరు తెదేపా సానుభూతిపరులు అరెస్టు