ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వినోదం మాటున విశృంఖలత్వం... పట్టించుకోని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు...

PUB CULTURE: రాత్రయితే చాలు అక్కడ విచ్చలవిడితనం రాజ్యమేలుతుంది.. చెవులు చిల్లులు పడేలా వాయిద్యాలు.. ఇష్టారీతి నృత్యాలు.. కొన్నిచోట్ల ప్రత్యేక అతిథులకు మాదకద్రవ్యాలు.. అప్పుడప్పుడు బాహాబాహీ యుద్ధాలూ.. ఇవీ తెలంగాణలోని హైదరాబాద్​ నగరంలోని పబ్‌లలో కనిపించే దృశ్యాలు. తాజాగా జూబ్లీహిల్స్‌ పబ్‌ నుంచి ఒక బాలికను నిందితులు బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో వీటి బాగోతాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

pubs
pubs

By

Published : Jun 5, 2022, 12:24 PM IST

PUB CULTURE: పాశ్చాత్య సంస్కృతి పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా పబ్బులు మారుతున్నాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం అంతటా ఈ పబ్ కల్చర్ వ్యాపించింది. యువతను మత్తులో ఊగిస్తోంది. తాగండి.. ఎంజాయ్ చేయండి అంటూ.. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నడుపుతున్నారు. యువతులపై, మహిళపై దాడులకు కారణమవుతున్నారు. మొన్న బంజారాహిల్స్‌లో ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో మాదకద్రవ్యాల కలకలం.. నిన్న రాంగోపాల్‌పేట టకీలా పబ్‌లో అశ్లీల నృత్యాల కలవరం.. నేడు జూబ్లీహిల్స్‌ అమ్నీషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌లో మైనర్ల పార్టీ వ్యవహారం.. ఇలా ఇవి తరచూ వివాదాలకు కేంద్రాలవుతున్నాయి. జూబ్లీహిల్స్‌ పబ్‌ నుంచి ఒక బాలికను నిందితులు బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో వీటి బాగోతాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

రాయితీలంటూ వల...పుట్టినరోజు, వీడ్కోలు వేడుకలు, ఫ్రెషర్స్‌ డే పేరుతో పార్టీలు చేసుకుంటే రాయితీలు ఇస్తామంటూ పబ్‌ల నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. రాత్రివేళ వస్తే ప్రత్యేకంగా సమావేశ గదులు ఏర్పాటు చేస్తామని ఊరిస్తుంటారు. దీంతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు తరచూ వేడుకల పేరుతో పబ్‌లకు వెళ్తున్నారు.

* బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పంజాగుట్టలోని ఓ పబ్‌కు కొద్దిరోజుల క్రితం వెళ్లారు... తొలుత నాన్‌ ఆల్కహాలిక్‌ పార్టీ అన్నారు. తర్వాత మద్యం సరఫరా చేశారు. మద్యం మత్తులో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

వివాదాలు.. దాడులు..కొన్ని పబ్‌లలో మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని తెలిసినా పట్టించుకోవడంలేదు. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో మాదకద్రవ్యాలు దొరికిన అనంతరం.. ప్రతి పబ్‌లో బార్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. అది అమలు కాలేదు. ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలూ చేయడం లేదు.

* మత్తు, చీకటి, గుంపు మనస్తత్వంతో కూడిన వాతావరణానికి చాలా మంది విచక్షణ కోల్పోయి ప్రవరిస్తున్నారు. వివాదాలు సృష్టిస్తున్నారు. యువతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నారు.

* కొందరు రాజకీయ నాయకుల కుమారులు పబ్‌లలోనే సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. రెండు, మూడు నెలల వ్యవధిలో మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

నిబంధనల బేఖాతరు... జీహెచ్‌ఎంసీ పరిధిలో బార్ల నిర్వహణకు శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఉంటుంది. చాలా పబ్‌లు ఈ నిబంధనను గాలికొదిలి.. తెల్లవారేవరకు దందా సాగిస్తున్నాయి.

* మాదాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 లోని పబ్‌లు అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్‌ రాత్రి రెండు గంటలు దాటాకే మూతపడుతుంది.

* బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని మూడు పబ్‌లు అర్ధరాత్రి దాటాక కూడా రణగొణధ్వనులు కొనసాగిస్తుంటే స్థానికులు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకటి, రెండురోజుల తర్వాత మామూలే.

* ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు పబ్‌లో మద్యం తాగాలంటే 21 ఏళ్లు ఉండాలి. ఆధార్‌ కార్డు లేదా గుర్తింపు కార్డు చూపించాలి. ఇందుకు విరుద్ధంగా 20 ఏళ్ల లోపు వారు పబ్బులకు వస్తున్నారు.

బార్ల ముసుగులో పబ్‌లు..

వాస్తవానికి పబ్‌లకు ప్రత్యేకంగా లైసెన్సులు ఉండవు. ఎక్సైజ్‌శాఖ నుంచి బార్‌ నిర్వహణ పేరుతో లైసెన్సు పొందుతున్న నిర్వాహకులు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పబ్‌ పేరు తగిలిస్తున్నారు. బార్లకు భిన్నంగా డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ వినియోగదారుల నృత్యాలకు అనుమతిస్తున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు దొరుకుతుండటంతో యువత వీటికి బానిసలుగా మారుతున్నారు. నిర్వాహకులు ప్రతి నెలా రూ. కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్నారు. తమకు సహకరించే పోలీసులకు భారీ నజరానాలు ఇస్తున్నారు. బడాబాబుల అండదండలతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. గతంలో బంజారాహిల్స్‌ రోడ్‌నం.2లోని ఓ పబ్‌లో పాతబస్తీకి చెందిన యువకులు ఏకంగా ముజ్రా పార్టీ నిర్వహిస్తూ దొరికిపోయారు. కొన్ని పబ్‌ల వైపు కన్నెత్తి చూడొద్దంటూ స్థానిక పోలీసులకు అనధికారిక ఆదేశాలొస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బంజారాహిల్స్‌, రాంగోపాల్‌పేట పబ్‌లలో చీకటి వ్యవహారాలు వెలుగు చూసిన తర్వాత ఇద్దరు ఎస్‌హెచ్‌వోలపై వేటు పడటం లాంటి ఘటనలు నిర్వాహకులతో పోలీసుల సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇవీ చదవండి:

Rape: కాకినాడలో దారుణం.. బాలికపై ప్రైవేటు వసతిగృహం నిర్వాహకుడు అత్యాచారం

TIGER IN KAKINADA: ఇంకా చిక్కని పులి జాడ.. మరో రెండు బోన్లు ఏర్పాటు..!

ABOUT THE AUTHOR

...view details