అమ్మానాన్నలతో క్లాసులో జరిగిన ఏదైనా సందర్భం లేదా... స్నేహితులతో జరిగిన తగాదాల గురించి పిల్లలు చెబుతున్నప్పుడు చాలామంది పూర్తిగా వినరు. ఆ సంఘటనకు కారణం తమ పిల్లలే అనుకుని.. ‘నువ్వు ఏం చేశావో అర్థం అవుతుందా? ఇక మాట్లాడకు’...అంటూ గట్టిగా అరవడం మొదలుపెడతారు. దాంతో పిల్లలు తమ మనసులోని అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పడానికి భయపడతారు. పెద్దయ్యేకొద్ది ఈ భయం కూడా పెరుగుతుంది. ఈ ప్రవర్తన వల్ల పిల్లలు పెద్దవాళ్లకు మానసికంగా దూరమవుతారు. అందుకే పిల్లలు చెప్పేది పూర్తిగా వినాలి.
ఇష్టమైన ఆహారపదార్థాలను పిల్లలు కాస్త ఎక్కువగా తింటారు. ‘ఇంత తింటే నువ్వు లావై పోతావ్’ అంటూ పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. దాంతో పిల్లలు ఏం తినాలన్నా వెనుకాడతారు. కాస్తంత తిన్నా.. ఎక్కడ లావు అవుతామో అనే ఆలోచన వారి మనసులో నాటుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి పిల్లల్లో చక్కగా అవగాహన కల్పించాలే తప్ప, వారిలో లేనిపోని భయాలను నింపేయకూడదు.