Telangana New Secretariat : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి మొత్తం పనులను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు మూడు పూటలా పనులు సాగుతున్నాయి. సువిశాలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక భద్రతా విషయమై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
1999 నుంచి ఎస్పీఎఫ్..
Telangana New Secretariat Safety : ప్రస్తుతం సచివాలయ భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - ఎస్పీఎఫ్ నిర్వహిస్తోంది. 1999 నుంచి వీళ్లే ఈ బాధ్యతలను చూస్తున్నారు. పాత సచివాలయ భవనాలు ఉన్నన్నాళ్లు 245 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉండేవారు. సచివాలయాన్ని బీఆర్కేఆర్ భవన్కు మార్చాక ఆ సంఖ్యను 87కు కుదించారు. బేగంపేట మెట్రో రైల్ భవనానికి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాక అక్కడ 28 మందిని నియమించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయ భవనం వద్ద మరో 18 మంది విధుల్లో ఉన్నారు. మొత్తం 131 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది సచివాలయ సంబంధిత విధుల్లో ఉన్నారు.