somu veerraju:'మోదీ ఫొటో లేకుండా ప్రారంభిస్తారా?' రాష్టంలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేయడం మానేసి.. తిట్ల దండకంతోనే సరిపెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ వాహనాలను పరిశీలించిన ఆయన.. వాటిపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైకాపా రంగులుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో సింగిల్ స్టిక్కర్ విధానం పోయి.. డబుల్ స్టిక్కర్ విధానం అమల్లోకి వచ్చిందని ఎద్దేవా చేశారు.
'నిధులేమో కేంద్రానివి.. ఫొటో జగన్‌దా?'
గ్రామాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం, స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలను 2014 నుంచి అమలు చేస్తోందని అన్నారు. ఏడాదికి 1,500 కోట్ల రూపాయల నిధులను నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామాలకు విడుదల చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో నిధులు ఇస్తున్నా- చెత్త సేకరణ వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం వైకాపా రంగులు ఎలా వేస్తుందని వీర్రాజు ప్రశ్నించారు. పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసినందుకు- హైకోర్టు నుంచి మొట్టికాయలు వేసినా... ప్రభుత్వంలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. మోదీ చిత్రాన్ని రాష్ట్రంలో ప్రజలకు కనిపించకుండా చేయాలనే జగన్ ప్రయత్నాన్ని తాము తిప్పుకొడతామని అన్నారు.
ఇదీ చదవండి:KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'