Plenary: ‘ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి 6 హామీలను అమలు చేయలేకపోయాం. మూడో ఏడాదీ సంక్షేమ బావుటా ఎగుర వేశాం’ అంటూ మూడేళ్ల వైకాపా పాలనలో చేసిన పనులపై ముద్రించిన కరపత్రాలను ప్లీనరీకి వచ్చిన వారికి పంపిణీ చేశారు. ప్రజలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖతోపాటు ప్రజా బ్యాలెట్‌నూ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆత్మీయంగా జగన్ రాస్తున్న ఉత్తరం అంటూ 4 పేజీల బుక్‌లెట్‌ను రూపొందించారు. 2 పేజీలు ముఖ్యమంత్రి లేఖకు కేటాయించారు. ఇందులో వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన మార్పులని.. వాలంటీర్ల వ్యవస్థ, ఆంగ్ల మాధ్యమం, నాడు-నేడు, రైతుభరోసా కేంద్రాలు, దిశ చట్టం వంటి అంశాలను ప్రస్తావించారు. మరో 2 పేజీలను ప్రజాబ్యాలెట్ కోసం కేటాయించారు.
50 అంశాలతో ప్రశ్నావళి రూపొందించి ‘మీరే నిర్ణయించండి’ అంటూ వాటికి అవును, కాదు అని సమాధానం ఇవ్వాలని సూచించారు. చివరి పేజీలో ఫోన్ నంబరు ఇచ్చి మిస్డ్‌కాల్ ఇచ్చి వైకాపా పాలనకు మద్దతు పలకాలని విన్నవించారు.