ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Good news for singareni employees: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అందరికీ ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఈనెల 31లోపు విధుల్లో చేరాలని తెలిపారు. దీంతో మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన 1,082 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరనున్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో సింగరేణిలో పనిచేస్తున్న 43,899 మందికి ప్రయోజనం చేకూరనుంది.

singareni
singareni

By

Published : Aug 13, 2021, 7:47 AM IST

తెలంగాణలో సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను సింగరేణి పర్సనల్ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ గురువారం విడుదల చేశారు.

నూతన ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31న తర్వాత పదవీ విరమణ పొందిన ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 31లోగా విధుల్లో చేరాలని యాజమాన్యం స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగాల్లో చేరనిపక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదన్నారు. పదవీ విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్కు- నో పేగా పరిగణిస్తామన్నారు. కానీ ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తించడం జరుగుతుందన్నారు. పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్​ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్‌ అధికారులను సింగరేణి కోరనుంది.

తిరిగి చేరేవారికి ఈ నిబంధనలు

తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగులు, అధికారులకు కోల్‌ మైన్స్‌ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సమగ్ర విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను కంపెనీ వ్యాప్తంగా అన్ని గనుల కార్యాలయాలు, నోటీసు బోర్డులపై కార్మికులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈపీ ఆపరేటర్లు, ఎంవీ డ్రైవర్లు విధుల్లో చేరిన నెల రోజుల్లోగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందన్నారు. పదవీ విరమణ పెంపుతో ఇప్పటికే రిటైర్‌ అయిన 1,082 మంది ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 43,899 వేల మంది ఉద్యోగులు లబ్థి పొందనున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది.

పదవీవిరమణకు సంబంధించిన పలు కీలక అంశాలు

మార్చి 31 తేదీ పదవీవిరమణపొంది.. గ్రాట్యూటీ, లీవ్‌ ఎన్‌ క్యాష్‌ మెంట్‌ తీసుకున్న ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరిన 15 రోజుల్లో ఆ సొమ్మును కంపెనీకి చెల్లించాలని యాజమాన్యం స్పష్టంచేసింది. ఒకవేళ గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌ క్యాష్‌మెంట్‌ సొమ్ము చెల్లించకపోతే క్యాష్‌ క్రెడిట్‌ రేట్‌ ప్రకారం వడ్డీని నెల నెలా జీతం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వారు 61 ఏళ్ల తర్వాత పదవీ విరమణ అనంతరం అప్పటికి వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగిలిన సొమ్మును నిబంధనల ప్రకారం చెల్లిస్తారన్నారు. గ్రాట్యూటీ, ఎఫ్‌.బి.ఐ.ఎస్‌., జేపీఏఐఎస్‌, జీఐఎస్‌, లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ లాంటి టర్మినల్‌ బెనిఫిట్లను నిబంధనల మేరకు 61 సంవత్సరాల పదవీ విరమణ తర్వాత చెల్లిస్తారు. పదవీ విరమణ పొంది పింఛన్‌, సీఎంపీఎఫ్‌ డబ్బు తీసుకున్న వారి విషయంలో సీఎంపీఎఫ్‌ అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. వీటికి వేరే ఉత్తర్వులు విడుదల చేయడం జరుగుతుంది.

వారి విషయంలో ఏమి చేస్తారంటే..

మార్చి 31వ తేదీ తర్వాత పదవీ విమరణ పొంది చనిపోయిన వారిని కంపెనీ సర్వీసులో ఉన్నప్పుడే మరణించిన వారిగా పరిగణించి వారి కుటుంబానికి కంపెనీ ద్వారా అందే ప్రయోజనాలను అందిస్తారు. ఇంకా ప్రాసెస్‌ కానీ గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్‌ ఇతర క్లెయిమ్​లను తక్షణమే ఉపసంహరించుకోవడం, రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగి, అధికారి పదవీ విరమణ పొందిన అనంతరం ప్రాసెస్‌ చేస్తామని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. సీపీఆర్‌ఎంఎస్‌ మెడికల్‌ కార్డు తీసుకున్న వారు వాటిని తిరిగి కంపెనీకి ఇచ్చేయాల్సి ఉంటుంది. రిటైర్‌ అయిన తర్వాత మళ్లీ కార్డులు జారీ చేస్తామని యాజమాన్యం తెలియజేసింది. దానిపై ఉన్న బ్యాలెన్సును వారు ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగుల వేతన సవరణ జేబీసీసీఐ ఒప్పందాల ప్రకారం ఉంటుంది. అధికారుల వేతన సవరణ పీఆర్సీ / డీపీఈ నిబంధనల ప్రకారం ఉంటుంది. తిరిగి విధుల్లో చేరే ఉద్యోగుల సీనియారిటీని కాపాడటం జరుగుతుంది.

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు

పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులపై సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​, సింగరేణి సీ అండ్‌ ఎం.డి. శ్రీధర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి ఉన్నతికి మరింత అంకిత భావంతో పనిచేస్తామని సిబ్బంది పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: PRC Implementaion: వేతన సవరణ కమిషన్ వ్యథ ఎప్పటికి తీరేనో?

ABOUT THE AUTHOR

...view details