తెలంగాణ సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకొంది. టెండర్ ప్రక్రియలో సంస్థ ఎల్-1గా నిలిచింది. భవన సముదాయ నిర్మాణం కోసం రహదార్లు, భవనాల శాఖ రూ.494 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థతో పాటు ఎల్ అండ్ టీ సంస్థలు రేసులో నిలిచాయి. ఆర్థిక బిడ్లను తెరిచాక కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు బిడ్లను నివేదించారు. రెండు సంస్థల ఆర్థిక బిడ్లను పరిశీలించారు. రూ.494 కోట్లపై షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నాలుగు శాతం అధికంగా బిడ్ దాఖలు చేయగా.. ఎల్ అండ్ టీ సంస్థ 4.8శాతం ఎక్కువగా బిడ్ దాఖలు చేసింది. తక్కువ కోట్ చేసిన పల్లోంజీ సంస్థకు టెండర్ దక్కింది. ఈ మేరకు అంగీకార పత్రాన్ని సంస్థకు ఆర్ అండ్ బీ శాఖ అందించింది.
సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం ఆదివారాలు, పండగ రోజుల్లో కూడా 24 గంటలూ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం టెండరులోనే వెసులుబాటు కల్పించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఎల్అండ్టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రెండు సంస్థలు సాంకేతిక బిడ్స్‌లో అర్హత పొందటంతో రహదారులు-భవనాల శాఖ ఆర్థిక బిడ్స్‌ను గత వారం తెరిచింది.