పీటీఐ కథనం ప్రకారం... అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు ఏడుగురు తెదేపా సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభనుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి నిరసనగా సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా తెదేపా ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభనుంచి బయటకు వెళ్లిపోయారు.
ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. తెదేపా సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి తమ నిరసన తెలిపారు. కొంత సమయం సభ గందరగోళంగా మారింది. శీతాకాల సమావేశాల్లో వరసగా నాలుగో రోజు తెదేపా సభ్యులను సస్పెండ్ చేశారు.