ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RS PRAVEEN KUMAR: తెలంగాణలో... గురుకులాలపై ప్రవీణ్‌ కుమార్ ముద్ర..! - telangana latest news

ఆర్​.ఎస్ ప్రవీణ్ కుమార్... ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం తెలంగాణ గురుకులాల కార్యదర్శిగానే కాకుండా పోలీసు అధికారిగానూ సమర్థంగా సేవలందించారు. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలకు పూలబాట వేశారు.

praveen-kumar
praveen-kumar

By

Published : Jul 20, 2021, 8:06 AM IST

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో జన్మించిన ప్రవీణ్‌కుమార్‌ 17 సంవత్సరాలపాటు పోలీసుశాఖలో పనిచేశారు. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. కరీంనగర్‌లో ఆయన పని చేసిన సమయంలో.. ఒకేసారి 45 మంది జనశక్తి నక్సలైట్లు లొంగిపోయారు. దాంతో ఆ సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా ఉండేలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొన్నాళ్లు అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి రాగానే తానే ప్రభుత్వాన్ని అడిగి గురుకులాల బాధ్యత తీసుకున్నారు. చిన్నపుడు ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్న ఆయన అవే పాఠశాలల సొసైటీకి తొమ్మిదేళ్లపాటు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు క్రీడలు, సామాజిక అంశాలు, కళలు, సాహస క్రీడలు తదితర అంశాల్లో అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గురుకులాలను డిగ్రీ, పీజీ కళాశాలల స్థాయికి చేర్చారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో వారు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎయిమ్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు పొందారు. కొందరు విదేశాల్లోని అవకాశాలనూ అందిపుచ్చుకున్నారు.

మాలావత్‌ పూర్ణ ఎవరెస్టు పర్వతం అధిరోహించేందుకు చేసిన ప్రయత్నాల్లో, బాలికకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రభుత్వం ప్రశ్నించింది. తానే తీసుకుంటానని హామీ ఇచ్చి అనుమతి సాధించారు. ఆ బాలిక చిన్నవయసులో ఎవరెస్టు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత మరెందరో బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు సాహస క్రీడల్లోనూ రాణించారు.

సిపాయిలు కాదు.. అధికారులు కావాలి..

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు సైన్యంలో ఎక్కువగా కిందిస్థాయి పోస్టుల్లోనే ఉంటున్నారని, అలాకాకుండా అధికారులు కావాలని ప్రోత్సహించారు. భువనగిరిలో సైనిక గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించారు. కరీంనగర్‌ చొప్పదండి, వరంగల్‌ అశోక్‌నగర్‌లో సైనిక పాఠశాలలు వచ్చాయి. పేద విద్యార్థులు సెలవుల్లో ఇంటికి వెళ్తే ఒకపూట తిండి, కూలి పనులు చేయాల్సి వస్తోందని వేసవి సెలవుల్లోనూ విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు.

ఆ చిన్నారులు కళలు, క్రీడల్లో శిక్షణ ఇస్తూ రెండు పూటలా ఆహారం అందించారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్‌ సీట్లు లక్ష్యంగా ప్రత్యేకంగా అప్‌గ్రేడ్‌ చేసిన ప్రతిభా గురుకుల కళాశాలలు మంచిపేరు సాధించాయి. విద్యార్థులు విదేశాల్లోనూ ప్రాజెక్టులు చేసేలా యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని పంపించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేశారు. ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఎంతైనా ఖర్చు భరించి వైద్యం అందించేందుకు సిద్ధపడేవారు.

స్వేరో సంస్థ ఏర్పాటు...

గురుకులాల్లో చదివిన పూర్వవిద్యార్థులతో ‘స్వేరో’ సంస్థను ఏర్పాటు చేశారు. వారు ఇచ్చిన విరాళాలను విద్యార్థుల శ్రేయస్సుకు ఖర్చుచేశారు. ఇందులో సభ్యత్వం తీసుకున్నవారు ‘స్వేరో’ సిద్ధాంతాల మేరకు పనిచేయాలన్న షరతు పెట్టారు. తొలుత సంక్షేమ భవన్‌లో స్వతంత్రంగా ఉన్న ఈ సంస్థను ఇటీవల గురుకుల సొసైటీ పరిధిలోకి తీసుకువచ్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

RS PRAVEEN KUMAR: ఐపీఎస్​కి ప్రవీణ్ కుమార్ రాజీనామా.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details