రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ మరింత ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు అధికారులతో నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ రెండోరోజు రద్దయ్యింది. సమావేశం ఏర్పాటుకు ఎస్ఈసీ రమేశ్‌కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నేడు జరగాల్సిన వీడియోకాన్ఫరెన్స్ రద్దయ్యింది. దీనిపై ఎన్నికల కమిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, హెచ్‌పీ సీఈవోలు, పంచాయతీరాజ్ అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించ తలపెట్టిన వీడియోకాన్ఫరెన్స్ మరోసారి రద్దయ్యింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో.. వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని కలెక్టర్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహణ కోసం గతంలోనే ఎస్ఈసీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేనందున సమావేశం అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని నిమ్మగడ్డకు ప్రత్యుత్తరం పంపారు. దీంతో నిన్న జరగాల్సిన వీడియోకాన్ఫరెన్స్ రద్దయ్యింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. నేడు మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు పాల్గొనేలా చూడాలంటూ కోరారు. సమావేశం నిర్వహించేందుకు ఎస్ఈసీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వీడియోకాన్ఫరెన్స్ మరోసారి రద్దయ్యింది.
ప్రభుత్వం తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ యోచిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్థానిక ఎన్నికల పిటిషన్లు విచారణకు వచ్చినపుడు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
సీఎస్ నీలం సాహ్నికి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ