అభ్యర్థుల నామినేషన్ల దాఖలు విషయంలో ప్రభుత్వ సిబ్బంది లేదా ప్రత్యర్థి పార్టీల వారు ఆటంకాలు సృష్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హెచ్చరించారు. ఈ విషయంపై పకడ్బందీగా వ్యవహరించేలా డీజీపీతో సైతం మాట్లాడినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా, అలసత్వంతో ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు ఆఖరిరోజైన ఇవాళ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.
కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా అన్నీ సజావుగానే ఉన్నాయి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఇదివరకే 40 వేల బ్యాలెట్ బాక్సులు తెప్పించుకున్నామని తెలిపారు. సిబ్బంది కొరత లేదని.. యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచినట్లు వెల్లడించారు. మద్యం నియంత్రణ ఆర్డినెన్స్ నిష్పక్షపాత అమలును వ్యయ పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగుల విషయంలో హైకోర్టు సూచనలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానన్నారు.