తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కోరలు చాస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌పై 'ఏడిస్ ఈజిప్టి' దోమ విరుచుకుపడుతోంది. గతేడాది జులై 20 వరకూ హైదరాబాద్‌లో 140 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాదిలో అదేరోజుకు రాజధానిలో 696 కేసులున్నట్లు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన డెంగీ కేసుల్లో 66 శాతం హైదరాబాద్‌లోనివే. గతేడాది జులై 20 నాటికి రాష్ట్రంలో 356 కేసులు నిర్ధారణ కాగా.. ఈ ఏడాదిలో ఇదే తేదీనాటికి మొత్తంగా 1,501 మంది డెంగీ బాధితులను గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం రంగారెడ్డి(144), కరీంనగర్(90), మేడ్చల్ మల్కాజిగిరి(76), ఆదిలాబాద్(62), మహబూబ్‌నగర్(57), పెద్దపల్లి(43), ఖమ్మం(36), వికారాబాద్(24) తదితర జిల్లాల్లో అధిక సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గత 7 వారాలుగా కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే31 వరకు 397 మంది డెంగీకి చికిత్స పొందగా.. జూన్‌లో 565 మంది.. ఈనెల(జులై)లో 20నాటికి మరో 539 మంది.. 7 వారాల వ్యవధిలో 1,104 మంది డెంగీ కోరల్లో చిక్కుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మలేరియాతో పాట్లు:భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మలేరియా వణికిస్తోంది. ఈ ఏడాదిలో జులై 20 వరకూ 252 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో మే నెలలో 69, జూన్‌లో 30, ఈ నెలలో 20వతేదీ నాటికి 51 మంది చొప్పున దీని బారినపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 138 మందికి మలేరియా సోకగా.. ములుగులో 51 మందికి నిర్ధారణ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశాల ప్రకారం.. అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే.. గుర్తింపునకు నోచుకోకుండా సమాజంలో పదింతలు ఎక్కువ కేసులున్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు.
ఆసుపత్రుల కిటకిట:రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 600-800 మంది వస్తున్నారు. తరచూ వర్షాలు కురవడం, పారిశుద్ధ్య నిర్వహణలోపం వల్ల దోమలు ప్రబలడానికి కారణమని, పట్టణాలు, పల్లెల్లో విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అత్యధిక జ్వరాలు నమోదవుతాయని వైద్యవర్గాలే చెబుతున్నాయి. రానున్న నెలల్లో డెంగీ, మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. 2019లో వలె ఈఏడాదీ డెంగీ కేసులు విజృంభించినట్లు వైద్యఆరోగ్యశాఖే చెబుతోంది. 2019లో 13,361 కేసులు నమోదు కాగా.. ఏడుగురు డెంగీతో చనిపోయినట్లుగా వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రానున్నది వ్యాధుల సీజన్ కావడంతో ఇప్పట్నుంచే నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.