Virata Parvam: సరళ తల్లిదండ్రులు స్వరాజ్యం, భిక్షమయ్య. తండ్రి వామపక్ష విప్లవభావాలు కలిగిన వ్యక్తి. సీపీఐ ఆర్గనైజర్‌గా వ్యవహరించేవారు. వీళ్ల కుటుంబం భూపాలపల్లి జిల్లా (ఉమ్మడి వరంగల్ జిల్లా) మోరంచపల్లిలో ఉండేది. అక్క, ఇద్దరు సోదరుల తర్వాత నాలుగో సంతానంగా జన్మించిన సరళ అంటే ఇంట్లో అందరికీ గారాబమే. అల్లారుముద్దుగా పెంచారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా వామపక్ష ప్రభావం కలిగి ఉండడంతో పిల్లల చదువుల కోసం 1985లో వీరి కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది. చాలా పేదరిక నేపథ్యం. సరళ పైకి చెప్పకున్నా.. ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగానే ఇంట్లో చెబితే వద్దంటారని కుటుంబసభ్యులకు చెప్పకుండా అడవిబాట పట్టారు. పీపుల్స్‌వార్‌లో పనిచేస్తున్న శంకరన్నను వెతుక్కుంటూ ఖమ్మం నుంచి నిజామాబాద్ అడవుల్లోకి వెళ్లారు. అక్కడ పీపుల్స్‌వార్ ఉద్యమకారులు సరళను పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకొని హతమార్చారు. సరళ ఇంట్లో నుంచి వెళ్లాక సుమారు 35 రోజులకు పీపుల్స్‌వార్ విడుదల చేసిన లేఖ ద్వారా సరళ చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిసి ఒక్కసారి విషాదంలో మునిగిపోయారు.
ప్రేమ కలిగిన ధైర్యశాలి
Virata Parvam Sarala :సరళ జీవితం ఆధారంగా తీసిన విరాటపర్వం కథ ఎలాగుంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరళ సోదరుడు, వరంగల్‌లోని ప్రశాంతి ఆసుపత్రి ఛైర్మన్ తూము మోహన్‌రావును దర్శకుడు వేణు మూడు నెలల కిందట కలిసి సరళ జీవితాన్ని విరాటపర్వం చిత్రంగా తీస్తున్నట్టు చెప్పారు. అంతకుముందే దర్శకుడు ఆమె గురించి ఎంతో పరిశోధన చేసి అనేక విషయాలు తెలుసుకున్నారు. అడవికి వెళ్లాక సరళ అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లను లోతుగా పరిశీలించి చిత్రాన్ని రూపొందించారు.
సాయి పల్లవిని చూసి ఏడ్చేశారు
Virata Parvam Inspiration Sarala : సరళ పాత్రలో నటించిన సాయి పల్లవి ఇటీవల విరాటపర్వం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనేందుకు హనుమకొండకు వచ్చారు. అప్పుడు సరళ తల్లి, కుటుంబసభ్యులు ఆమెను కలిశారు. ‘సాయి పల్లవిని చూడగానే మా చెల్లెలు సరళను చూసినట్టు అనుభూతి పొందామని, దశాబ్దాల కిందట మా నుంచి దూరమైన చెల్లి మళ్లీ వచ్చినట్టు భావోద్వేగానికి గురై అంతా ఏడ్చేశామని, సాయి పల్లవి కూడా కన్నీరు పెట్టుకొంది’ అని మోహన్‌రావు తెలిపారు. సరళ ప్రేమ స్వభావంగల మనిషి. ధైర్యశాలిగా, చిన్నప్పటి నుంచే ప్రశ్నించేతత్వం ఉండేదని చెప్పారు.