ప్లాస్టిక్ వినియోగం తగ్గించటంలో ప్రపంచ దేశాలు చేసిందేమీ లేదు..! సాధించింది గోరంత..! సాధించాల్సింది కొండంత..! ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) ఇటీవల విడుదల చేసిన నివేదికలోని సారాంశమిది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది..ఈ సంస్థ. ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై అవగాహన కల్పిస్తూ... సూచనలు చేస్తూ వస్తున్న యూఎన్ఈపీ...2018 నుంచి ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఆ ఏడాది ఎలెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్‌తో చేతులు కలిపి పర్యావరణ నిపుణుల నేతృత్వంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల పని తీరుని మదింపు చేసిన ఈ సంస్థ...ప్రస్తుత నివేదికను మన ముందుంచింది.
ఇంకా వెనుకబడే ఉన్నాయి..
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో ప్రపంచ దేశాలు ఏడేళ్లుగా ఎలాంటి కృషి చేశాయో పరిశీలించింది. ఈ సమయంలో కొంత మేర పురోగతి సాధించినా ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించటంలో ఇంకా పలు దేశాలు వెనకబడే ఉన్నాయని స్పష్టం చేసింది. యూఎన్‌ఈపీ, ఎలెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్ సంయుక్తంగా...ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు కీలక వ్యక్తులను ఈ విషయమై ప్రచారం చేయాల్సిందిగా కోరాయి. ప్లాస్టిక్‌ని ఓ సారి వినియోగించాక... ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా పునర్వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది...యూఎన్ఈపీ. ఇలా చేయటం ద్వారా కొత్త ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలు కలగటంతో పాటు కొత్త వ్యాపారాలకు ఆస్కారముంటుందని తెలిపింది. ఈ ప్రచారం కొంతమేర ఫలించిన కారణంగా...2019లో సత్ఫలితాలే కనిపించాయి. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కృషి చేశాయి పలు దేశాలు.
భారత్‌లోనే ముందడుగు
2019లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకొచ్చిన సంస్థల సంఖ్య 500 దాటింది. వీటిలో ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే సంస్థలూ ఉండటం గమనించాల్సిన విషయం. ఈ కృషి ఫలితంగానే...పునర్వినియోగ ప్లాస్టిక్ ఉత్పత్తుల ప్యాకింగ్ 22% మేర పెరగ్గా...వీటి వ్యాపారం ఏకంగా 81% పైగా అధికమైందని తేల్చి చెప్పింది..యూఎన్ఈపీ నివేదిక. అంటే..సరైన విధంగా కార్యాచరణ అమలు చేయాలే కాని...ప్లాస్టిక్ వాడకం తగ్గించటం పెద్ద కష్టమేమీ కాదని రుజువు చేస్తున్నాయి ఈ గణాంకాలు. కొన్ని సంస్థలైతే..100% ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటంలో భాగంగా ఓసారి వాడి పడేసే కవర్లు, స్ట్రాలను నిషేధించేందుకు ముందుకొస్తున్నాయి. ఎక్కడో కాదు..! భారత్‌లోనే ఈ ముందడుగు పడింది. ఒకసారి మాత్రమే వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ను తమ ప్యాకేజింగ్ నుంచి తొలగించినట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. దేశంలోని 50 ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల్లో ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది.
పునర్వినియోగ విధానాలవైపు
ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్న సంస్థల్లో 56% కంపెనీలు... పునర్వినియోగ విధానాలవైపు మళ్లుతున్నాయి. ప్రస్తుతమున్న సవాలు అధిగమించాలంటే... దాదాపు అన్ని సంస్థలూ ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందని చెబుతోంది..యూఎన్ఈపీ. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు...సముద్రాల్లో, వీధుల్లో, అడవుల్లో పేరుకుపోతోందని లెక్కలతో సమస్య తీవ్రతను కళ్లకు కడుతోంది ఈ సంస్థ. ప్రజారోగ్యానికి ఇవి ఏ మేర నష్టం చేస్తాయో ఊహించవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్థాల కారణంగా...ప్రజారోగ్యం దెబ్బతిని లక్షలాది అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అదే సమయంలో భూగోళానికీ చేటు చేస్తున్నాయి..ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు.
స్థానిక అధికార యంత్రాంగాల సమన్వయంతోనే..
గత 50 ఏళ్లలో ప్లాస్టిక్ ఉత్పత్తి 22 రెట్లు పెరిగింది. ఈ ఉత్పత్తికి అవసరమైన వసతుల కల్పనకు దశాబ్ద కాలంలో 180 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది ప్రపంచం. ఇదే సమస్య అనుకుంటే... కరోనా వైరస్ ప్రభావంతో గ్లౌజులు, పీపీఈ కిట్ల వినియోగం పెరిగింది. ఈ సమయంలో...ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించాయి. ఇప్పుడు ఈ సవాలు అధిగమించటమెలా అన్నది అంతు తేలని ప్రశ్న. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనుకుంటున్న ప్రభుత్వాలకు యూఎన్ఈపీ...మద్దతునిస్తోంది. ఈ లక్ష్యానికి కట్టుబడి ఉన్న వారికి అండగా ఉంటోంది. స్థానిక అధికార యంత్రాంగాల సమన్వయంతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చని స్పష్టంగా చెబుతోంది.
ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తున్న దేశాలు