నాన్వెజ్ తినే వాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలో అనారోగ్యానికి గురైన గొర్రెలు, మేకలు, చనిపోయిన జీవాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు, గొడ్డు మాంసాన్నీ వ్యాపారులు కల్తీ చేస్తున్నారని.. అశుభ్ర వాతావరణంలో జంతువధ చేయడమేగాక, వేర్వేరు ప్రాంతాల నుంచి మృత, అనారోగ్యకర జంతువులను తీసుకొచ్చి, మార్కెట్లో అడ్డగోలుగా విక్రయిస్తుండం ఆందోళనకు తావిస్తోందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం అధికారులు దాడులు చేస్తున్నా… పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రావడం లేదని తెలిపారు.
ఖైరతాబాద్ జోన్‌లో అధికంగా..
హైదరాబాద్‌లో జరిగే మాంసం వ్యాపారంలో జియాగూడ కబేళా నుంచి వెళ్లే జీవాలు 80 శాతం ఉంటాయి. ఈ కబేళా కేంద్రంగా భారీ వ్యాపారం జరుగుతుంది. కశ్మీర్ నుంచి మొదలుపెడితే.. అనేక రాష్ట్రాల నుంచి జియాగూడ కబేళాకు జీవాలు వస్తాయి. అందులో అనారోగ్యమున్న జీవాలు, చనిపోయిన మేకలు, గొర్రెలు ఉంటాయని, వాటినీ వ్యాపారులు మార్కెట్‌కు తరలిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. మాంసం దుకాణాలపై జరుపుతున్న తనిఖీల ఆధారంగా చూస్తే.. ఖైరతాబాద్ జోన్‌లో ఎక్కువగా కల్తీ మాంసం లభిస్తోందని, సికింద్రాబాద్, కూకట్‌పల్లి జోన్లలోనూ సంబంధిత దుకాణాలను గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ముద్ర ఉంటేనే కొనుగోలు చేయాలి..
జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఆమోద ముద్ర వేసిన జంతు కళేబరాల నుంచే మాంసాన్ని కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారిక కబేళాల్లో వధించిన మేక, గొర్రె పొట్టేలు, గొడ్డు మాంసాన్ని మాత్రమే ఉపయోగించాలంటున్నారు. జంతు కళేబరంపై బల్దియా ముద్ర ఉందా? లేదా? అని సరిచూసుకోవాల్సిన బాధ్యత పౌరులదేనని గుర్తుచేస్తున్నారు. ముద్ర గురించి దుకాణదారుడు ప్రశ్నించాలని, అప్పుడే వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని విక్రయిస్తారని సూచిస్తున్నారు.