గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరి ఉద్యోగం కూడా పోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరీక్ష పాస్ కావాలన్నారు. ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారని తెలిపారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని సజ్జల పేర్కొన్నారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని సజ్జల పేర్కొన్నారు.
ప్రస్తుతం పాడైన రోడ్లన్నీ తెదేపా హయాంలో దెబ్బతిన్నవే అని సజ్జల అన్నారు. రోడ్లపై గుంతలు పడ్డాయని తెదేపా అన్నిచోట్లా ఆందోళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం టెండర్లు పిలిచిందని.. వర్షాలు తగ్గాక రహదారి పనులు ప్రారంభం అవుతాయని సజ్జల అన్నారు.
రాయలసీమ లిఫ్టుపై తెదేపా వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆయన హయాంలోనే పాలమూరు రంగారెడ్డి తెలంగాణ కట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు గతంలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ దీక్ష చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. రాయలసీమకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో జనంలోకి వెళ్లి తెదేపా నేతలు చెప్పాలి. లిఫ్టు వల్ల రాయలసీమకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకెళ్లాలని కాలువలు వెడల్పు చేయాలని సీఎం నిర్ణయించారు'- సజ్జల రామకృష్ణారెడ్డి