‘వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. దాన్ని వక్రీకరించి పింఛన్లను తీసేస్తున్నారన్నట్లుగా వృద్ధులకు అపోహ కల్పించేలా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘ఇలా విమర్శిస్తున్నవారు ఏ నెల పింఛను ఆ నెల ఇవ్వరాదని కోరుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ‘అవసరాల నిమిత్తం పక్క రాష్ట్రాలకు వెళ్లినవారు మూడు నెలలకోసారైనా ఇక్కడకు వచ్చి పింఛను తీసుకునే వెసులుబాటును కల్పించింది మా ప్రభుత్వమే. దీనివల్ల అవినీతి జరిగే అవకాశం ఉందనే కొత్త నిబంధన తీసుకొచ్చాం’ అని చెప్పారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయాంలో ప్రతి నెలా నాలుగైదు లక్షల మందికి పింఛన్లు ఇవ్వలేదని రికార్డులున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు లబ్ధిదారులను హఠాత్తుగా ఏడెనిమిది లక్షలు పెంచేశారు. ఒక్క ఏడాదిలో అంతమంది అర్హులు ఎలా వచ్చేశారు? దీనికి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అర్హులకు ఎప్పటికప్పుడు పింఛను మంజూరుచేసే వ్యవస్థను తీసుకువచ్చారు. దీనివల్ల ఇప్పటివరకూ 10 లక్షల మంది పెరిగారు’ అని తెలిపారు.
విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు చంద్రబాబు వల్లే
విద్యుత్ సర్దుబాటు ఛార్జీల గురించి సజ్జల స్పందిస్తూ.. ‘2014లో రూ.4,110 కోట్లున్న డిస్కంల నష్టాలు 2019 నాటికి రూ.27,240 కోట్లకు ఎందుకు పెరిగాయి? 2014-19 మధ్య డిస్కంల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,400 కోట్లకు చేరింది. మేం వచ్చాక దీన్ని రూ.39,323 కోట్లకు తగ్గించగలిగాం. చంద్రబాబు హయాంలో మొత్తంగా విద్యుత్ సంస్థల అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకు పెరిగాయి. దీనిపై ఇప్పుడు ఏటా రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. రాష్ట్రాన్ని జగన్ ముంచేశారంటూ ప్రచారం చేస్తున్నారు కదా? చంద్రబాబు రాష్ట్ర అప్పును రూ.3లక్షల కోట్లకు పైగా పెంచడం వల్ల దానిపై ఏటా రూ.30వేల కోట్లకు పైగా వడ్డీల రూపంలో మా ప్రభుత్వం వచ్చాక కట్టాల్సి వస్తోంది. 2024లో ఎన్నికలకు వెళ్లే సమయానికి ప్రతీ రంగంలో పురోగతి చూపిస్తాం’ అని చెప్పారు.