వందల మంది పోలీసులు.. లక్షల్లో సీసీకెమెరాలు.. కోట్లలో జనాలు.. కనిపిస్తే చాలు ఎరుపెక్కిన చూపులతోనే కాల్చేసేంత ఆగ్రహం.. వీటన్నింటినీ దాటుకుని వెళ్లలేనని తెలిసిపోయిందో ఏమో.. ఇంత అత్యంత నీచమైన జీవితం బతకటం కంటే చావే శరణ్యం అనుకున్నాడేమో.. చివరికి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కామాంధుడు రాజు.
వేల కళ్లు వెతికాయి...
9వ తేదీ సాయంత్రం చిన్నారిని హత్యాచారం చేసి ఇంట్లో పెట్టి తాళం వేసి పారిపోయిన రాజు కోసం... 10వ తేదీ నుంచి పోలీసులు వెతకడం ప్రారంభించారు. 10న కర్మన్ ఘాట్, యాకత్పురా, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిందితుడు రాజు పర్యటించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆ తర్వాత ఎటువైపు వెళ్లాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు. నిందితుని వద్ద సెల్‌ఫోన్ లేకపోవటం కూడా పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంతో టెక్నాలజీ ఉన్నా ఓ నిందితున్ని పట్టుకోకపోవటంపై పోలీసుల మీద ఒత్తిడి పెరగడంతో... రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులు ఓ వ్యక్తి గురించి 10 లక్షలు పారితోషికం ప్రకటించడం... మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు 24 గంటల పాటు వెతకడం ఈ మధ్య కాలంలో చోటు చేసుకోలేదు. ఆటోలు, బస్సులు, రైళ్లకు పోస్టర్లు అంటించారు. నిందితుడు రాష్ట్రం దాటిపోయినా పట్టుకునేలా పోలీసులు ప్రచారం చేశారు. మరోవైపు అన్ని చోట్ల నిందితుడి కోసం పోలీసులు వందల సంఖ్యలో గాలించారు. హైదరాబాద్ మహానగరాన్ని జల్లెడ పట్టారు. రాష్ట్ర సరిహద్దులో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. రాజు కోసం రైల్వే ట్రాక్‌లపై గాలించి.. రైలు ప్రమాద ఘటనల్లో చనిపోయిన గుర్తుతెలియని మృతుల వివరాలు తెలుసుకున్నారు. శవాగారాల్లో భద్రపరిచిన మృతదేహాలను క్షుణ్ణంగా పరిశిలీంచారు. సామాజిక మాధ్యమాల్లోనూ నిందితుడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం చేశారు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉండటంతో రాష్ట్రంలోని 2200 వైన్స్ షాపుల వద్ద మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. కల్లు దుకాణాల వద్ద పోస్టర్లు అంటించారు. గణేశ్ మండపాల వద్ద మైకుల్లో ప్రకటన చేశారు.
పోలీసులకు వేలలో ఫోన్లు..
పోస్టర్లలో తూర్పు మండల సంయుక్త సీపీతో పాటు... దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ చరవాణీ నెంబర్లు ఉంచారు. రాష్ట్రాన్నే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలను కదిలించింది ఈ ఘటన. దీనికి నిదర్శనమే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, కశ్మీర్ నుంచి కూడా ఫోన్లు రావడం. రాజు పోలికలున్న వ్యక్తి తమ ప్రాంతంలో ఉన్నాడని... 15న రాత్రి కశ్మీర్ నుంచి తూర్పు మండల సంయుక్త సీపీకి ఫోన్ వచ్చింది. రెండు చేతులపై మౌనిక అనే పేరుతో పచ్చబొట్టు ఉంటే అతడే రాజు అని సంయుక్త సీపీ వాళ్లకు సూచించారు. చేతిపై పచ్చబొట్లు లేకపోవడంతో రాజు కాదని అక్కడి వాళ్లు నిర్దరించుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఇద్దరు పోలీస్ అధికారులకు వందల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. కొందరు నిందితుడి ఆనవాళ్ల గురించి ఆరా తీయడానికి ఫోన్ చేయగా... మరికొంత మంది కేసు గురించి కనుక్కోవడానికి ఫోన్ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి సమాచారం ఇవ్వడానికి ఇంకొందరు ఫోన్ చేశారు. ఎవరి నుంచి ఏ సమాచారం వస్తుందోననే ఉద్దేశంతో పోలీసు అధికారులు అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేసి సమాధానాలిచ్చారు.
పచ్చబొట్లు చూసి నిర్ధరణ...