ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు.. విజయవాడ, గుంటూరు-1 డిపోల బస్సుల్లో ప్రయోగాత్మక అమలు..! - e pass machines in buses

RTC CASHLESS TICKETS: మీరు ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణిస్తారా..? టికెట్లు తీసుకోవడానికి నగదు, చిల్లరను ఉంచుకోవడం కష్టంగా ఉందా..? ఇకపై మీ చేతిలో ఫోన్‌... అందులో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌లు, జేబులో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉంటే సరిపోతుంది. అది ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి..

RTC CASHLESS TICKETS
ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు

By

Published : Jun 8, 2022, 9:14 AM IST

RTC CASHLESS TICKETS: బస్సుల్లో ఈ-పాస్‌ యంత్రాల ద్వారా నగదు రహితంగా టికెట్ల జారీకి యంత్రాంగం సిద్ధమైంది. ఈమేరకు ఆర్టీసీకి చెందిన అన్ని సేవలను అందించేందుకు రూపొందించిన యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) యాప్‌, ఈ-పాస్‌ యంత్రాల ద్వారా ఈనెల 15 నుంచి టికెట్లను జారీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన బస్సుల్లో 15 రోజులుగా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. తాజాగా విజయవాడ, గుంటూరు-1 డిపోల పరిధిలోని దూరప్రాంత సర్వీసుల్లో దీనిని ప్రారంభించనున్నారు. కండక్టర్లకు టిమ్స్‌తోపాటు 200 ఈ-పాస్‌ యంత్రాలను ఇస్తారు. ఈ రెండింటితోనూ టికెట్లు ఇస్తారు. ఈ సమయంలో ఈ-పాస్‌ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి? యాప్‌లో టికెట్లు బుక్‌ చేసుకుంటే రెండింటికీ అనుసంధానం అవుతోందా? అనే విషయాలను దాదాపు రెండు వారాలపాటు పరిశీలిస్తారు.

సిబ్బందికి శిక్షణ పూర్తి
యూటీఎస్‌ యాప్‌ వినియోగం, ఈ-పాస్‌ యంత్రాలతో టికెట్ల జారీపై నాలుగు జోన్ల పరిధిలోని సిబ్బందికి ఆర్టీసీ ఐటీ విభాగం అధికారులు శిక్షణ ఇచ్చారు. చివరగా విజయనగరం జోన్‌ పరిధిలో సిబ్బందికి మంగళవారంతో శిక్షణ ముగిసింది. వీరంతా ఆయా జిల్లాల్లోని డిపోల పరిధిలో విడతల వారీగా కండక్టర్లకు తర్ఫీదు ఇస్తారు. అన్ని బస్సుల్లో పూర్తిస్థాయిలో వినియోగించేందుకు దాదాపు 13 వేల ఈ-పాస్‌ యంత్రాలను సిద్ధం చేయనున్నారు. వీటిని అద్దె ప్రాతిపదికన సరఫరా చేస్తున్న గుత్తేదారు సంస్థ.. వాటిలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేసేందుకు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కడపలలో సర్వీసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details