అంతర్వేది రధం ఘటన తర్వాత కుట్రపూరితంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటన పై సీబీఐ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. పవన్ ఫార్మ్ హౌస్‌లో, చంద్రబాబు జూమ్‌లో ఉండి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇక్కడ మతపరమైన అంశాలను లేవదీస్తోందని విమర్శించారు.
2017 అక్టోబర్ 19న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో రథం దగ్దమైందని.... తెదేపా, భాజపా, జనసేన భాగస్వామిగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. స్వామిజీలు, రాజకీయ పార్టీల నేతలు ఈ ఘటనపై ఇక మాట్లాడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దన్న మంత్రి... సీబీఐ విచారణలో ఏం తేలుతుందో వేచి చూద్దామన్నారు.