ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Retired employees on prc : పీఆర్సీ వివాదం.. హైకోర్టును ఆశ్రయించే యోచనలో రిటైర్డ్‌ ఉద్యోగులు - ఏపీ తాజా సమాచారం

Retired employees on prc :నూతన పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందని రిటైర్డ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై బృందాలుగా లేదా వ్యక్తిగతంగా హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. 2018 జులై తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మరింత అన్యాయం జరిగిందని వాపోయారు.

High Court
High Court

By

Published : Feb 9, 2022, 8:35 AM IST

Retired employees on prc : కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందని రిటైర్డ్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రయోజనాలు ప్రకటించకపోగా, ఉన్నవి కోత పెట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై చర్చిస్తున్నారు. పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు కలిసిరాకపోతే, తామే బృందాలుగా లేదా వ్యక్తిగతంగా హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. కొత్త పీఆర్సీలో ప్రకటించాల్సిన ప్రయోజనాలు, వాటి హేతుబద్ధతను జేఏసీ తరఫున అశుతోష్‌ మిశ్ర కమిటీకి నివేదించామని, ఆ డిమాండ్లేవీ పట్టించుకోకపోగా, ఉన్నవి ఊడ్చేశారంటూ పెన్షనర్లు వాపోతున్నారు. 2018 జులై తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మరింత అన్యాయం జరిగిందని చెబుతున్నారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ తగ్గించడం వల్ల నష్టపోతున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఉదాహరణకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించి రిటైర్డ్‌ అయిన ఓ జిల్లా నాయకుడికి కొత్త పీఆర్సీ వల్ల పెన్షన్‌లో కేవలం రూ.100 మాత్రమే పెరుగుదల కనిపించింది.

ఖర్చులను దృష్టిలో పెట్టుకోరా?

నాకిప్పుడు 84 ఏళ్లు. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు తద్వారా వైద్య ఖర్చులూ పెరుగుతాయి. మాలాంటి వాళ్ల పిల్లలు ఎక్కడో ఉంటారు. వారు చూడరని కాదు, కాని వారి అవసరాలు వారివి. వయసు పెరిగే కొద్దీ సంపాదించుకునే శక్తి ఉండదు. అందుకే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తుంటారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మందుబిళ్లలు పాతికకు, అర్ధ రూపాయికీ వచ్చేవి. అవే ఇప్పుడు రూ.5, రూ.10కి చేరాయి. మాకు పెన్షన్‌ లెక్కకట్టేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అది తప్పు. ఇతరుల సాయం లేకుండా వృద్ధులు ఎక్కడికీ వెళ్లలేరు. అసరాగా ఉండేవారికి జీతం, భోజనం ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను పీఆర్సీ కమిటీలకు జేఏసీ తరఫున డిమాండ్లు తయారుచేసి, ఏ ఫార్ములా ప్రకారం ఎంతివ్వాలో వాదించిన వాణ్ని. ఉమ్మడి రాష్ట్రంలోనూ పలు పీఆర్సీ కమిటీల ముందు హాజరై ఉద్యోగుల వాదన వినిపించాను. అశుతోష్‌ మిశ్ర కమిటీకి కూడా పెన్షనర్ల డిమాండ్లు విన్నవించాం. 65 ఏళ్ల నుంచే అదనపు పెన్షన్‌ 10శాతంతో ప్రారంభించాలని కోరాం. అది ఇవ్వకపోగా 70 ఏళ్ల నుంచి 10శాతంగా ఉన్నదాన్ని 7 శాతానికి తగ్గించారు. 75 ఏళ్ల వాళ్లకీ తగ్గించారు. వినియోగదారుల సూచి, ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కలు కట్టి మేం ఫిట్‌మెంట్‌ 55శాతం అడిగాం. ఏ లెక్కన ఐఆర్‌ కన్నా తగ్గించి 23 శాతం చేశారు? శాస్త్రీయత లేని ఈ నిర్ణయాలను సరిదిద్దాలి.- ఎస్‌.జె. భోగరాజు, ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు

ఒక్కొక్కరికి రూ.5 వేలకు పైగా నష్టం

కొత్త పీఆర్సీ వల్ల పెన్షనర్లు బాగా నష్టపోతున్నారు. ఈ నష్టం ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా ఉంది. పాత పెన్షన్‌ తీసుకుంటూ ఇప్పుడు మారిన విధానం వల్ల జరిగే నష్టం కొంతైతే.. 2018 జులై తర్వాత పదవీ విరమణ చేసిన వారు మరింత కోల్పోతున్నారు. ముందే 5 డీఏలు ప్రకటించి ఆ తర్వాత కొత్త పెన్షన్‌ అమలుచేసి ఉంటే 2018 తర్వాత రిటైర్‌ అయిన వారికి ఇంత నష్టం వాటిల్లేది కాదు. కొత్త పీఆర్సీ, డీఏలు కలిపి ఒకేసారి అమలు చేస్తుండటంతో నష్టపోతున్నాం.- పాండురంగ వరప్రసాదరావు, ఏపీటీఎఫ్‌ నేత

ఇంత ఉద్యమానికి ఇదా ప్రతిఫలం?

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల చలో విజయవాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వారి ఆవేదనకు అద్దం పట్టింది. ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. కానీ ఇప్పటికీ అన్యాయాన్ని సరిదిద్దలేదు. పెన్షనర్లకు కొత్తవి ఇవ్వకపోగా, పాతవి కోత పెట్టారు. ఇదీ అన్యాయమే. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో పాత విధానంలోనే అదనపు క్వాంటమ్‌ పెన్షన్లు ఇవ్వాలి. - ఈదర వీరయ్య, పెన్షన్‌దారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం హరిస్తోంది: ఉపాధ్యాయ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details