Relief for AP discoms ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ క్రయవిక్రయాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ పేరును నిషేధిత జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంతో రాష్ట్రం పేరును తొలగించినట్లు.. ఇంధన శాఖ తెలిపింది. కేంద్రం పేర్కొన్నట్లుగా... 350 కోట్ల బకాయిల చెల్లింపు.. ఎక్స్ఛేంజీలో నమోదు కాకపోవడంతో.. ఈ పొరపాటు తలెత్తిందని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ప్రస్తుతం యథాతథంగా ఎక్స్ఛేంజీల నుంచి ఏపీ డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అవకాశముందని తెలిపారు. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏపీ ఎలాంటి బకాయిలూ లేదని.. విజయకుమార్ స్పష్టం చేశారు. ఏపీ బకాయిలు లేనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో నమోదయిందని.. ఇంధన శాఖ తెలిపింది. దీంతో విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని స్పష్టం చేసింది. సమాచార లోపం వల్లే విద్యుత్ క్రయవిక్రయాల నిషేధిత జాబితాలో ఏపీ పేరు నమోదయిందని.. ఏపీ ఇంధన శాఖ వెల్లడించింది.
వివిధ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించని కారణంగా.. 13 రాష్ట్రాల డిస్కంలు ఎక్స్ఛేంజీల నుంచి జరిపే విద్యుత్ కొనుగోళ్లపై నిషేధాన్ని విధిస్తూ.. కేంద్రం గురువారం నిర్ణయం తీసుకుంది. లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ.. పలు రాష్ట్రాల డిస్కంలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆయా డిస్కంలు పంపిన లెక్కల ఆధారంగా బకాయిలు లేవని నిర్ధరణకు వచ్చిన మీదట... ఏపీతోపాటు మరో 5 రాష్ట్రాల డిస్కంల పేర్లను నిషేధిత జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వ ప్రాప్తి పోర్టల్‌లో... విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్ర డిస్కంలు 412 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు పొరపాటున చూపడంతో.. ఎల్పీఎస్ నిబంధనల మేరకు ఎక్స్ఛేంజీల విద్యుత కొనుగోళ్లపై నియంత్రణను కేంద్రం విధించిందని.. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివరించారు. వాస్తవానికి ఎలాంటి బకాయిలూ లేవని స్పష్టం చేశారు.