రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు మందు తాగి ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే... తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణిపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
60 శాతం మంది మత్తులోనే.. :సామూహిక అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నారు. పలు అధ్యయనాలూ ఇదే విషయం చెబుతున్నాయి. ‘మత్తులో ఉన్నప్పుడు వారికి విచక్షణ ఉండదు. తమ చర్యలపై నియంత్రణ ఉండదు. పశువాంఛ బయటపడుతుంది. ఈ క్రమంలో అమానుష చర్యలకు తెగబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు’ అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒకరికి... ఇద్దరు ముగ్గురు కలిసి...:మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి విచ్చలవిడి ప్రవర్తనకు అడ్డూ అదుపే ఉండదు. అలాంటి సందర్భాల్లో వారికి నిస్సహాయంగా, ఎదురించలేని స్థితిలో మహిళలు ఎవరైనా కనిపిస్తే అఘాయిత్యానికి తెగబడుతున్నారు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరికొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చిపోతున్నారు.
- మద్యం తాగని వారితో పోలిస్తే మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం అధికం. విపరీత ధోరణి ఉంటుంది. ఇది నేరాలకు దారితీస్తోంది.
- విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది.
- ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు మద్యం మత్తులో కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో మోది చంపేశాడు.
- అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు.
- లారీ డ్రైవర్ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.
కట్టేసి కొట్టి.. సామూహిక అత్యాచారం :స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులిద్దరూ మద్యం మత్తులో... ఆ యువతి స్నేహితుడిని కట్టేసి మరీ అతని ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.