ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAMESH BIDHURI: 'పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సానుకూలం' - telangana top news

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు సహజ వాయువుల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌ రమేశ్‌ బిధూరి తెలిపారు. రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటే కేంద్రంపైన ఒత్తిడి పెరుగుతుందని వివరించారు.

పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌ రమేశ్‌ బిధూరి
పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌ రమేశ్‌ బిధూరి

By

Published : Aug 28, 2021, 12:34 PM IST

‘రాష్ట్రాలు సహకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సానుకూలంగానే ఉంది. చమురు దిగుమతులు ఎంతగా తగ్గించుకుంటే ఆర్థికంగా దేశం అంతగా బలోపేతమవుతుంది. వాహన వినియోగంతోపాటు చమురు వినియోగమూ పెరుగుతోంది. చమురు విషయంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని పెట్రోలియం, సహజ వాయువుల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌ రమేశ్‌ బిధూరి చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలనకు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన ‘ఈటీవీ-భారత్​’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తేవడంపై ఎందుకు సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు?

కేంద్రానిది కాదు రాష్ట్రాలది సాచివేత ధోరణి. అవి ముందుకొస్తే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికే దశలవారీగానైనా జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి. తమ ఆర్థిక వనరులపై ప్రభావం పడుతుందని అత్యధిక రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో దీన్ని వ్యతిరేకించాయి. పెట్రోల్‌, డీజిల్‌లో 20-30 శాతం పన్నులు రాష్ట్రాలు విధిస్తున్నవే.

చమురు ధరల పెరుగుదలలో కేంద్రం పాత్ర లేదంటారా?

కేంద్ర సుంకం కొన్నేళ్లుగా స్థిరంగా ఉంది. రాష్ట్రాలు ఇష్టారీతిన పన్నులు పెంచుతున్నాయి. ప్రజలపై భారం పడకూడదన్న భావన ఉన్న రాష్ట్రాలు కొంత పన్ను తగ్గిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పన్నులతోపాటు సర్‌ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు... అసలు ధర ఎంత? కేంద్ర, రాష్ట్రాల పన్నులు ఎంతెంత? అనే వివరాలను బంకుల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేస్తున్నాం.

చమురు ధరలపై కేంద్ర, రాష్ట్రాలది దోబూచులాటలా కనిపిస్తోంది...?

రాష్ట్రాలన్నీ ఒక్కటై పన్నులు తగ్గిస్తామంటే కేంద్రం కాదంటుందా? రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటే కేంద్రంపైనా ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రం వసూలు చేసే సుంకంలో సింహభాగాన్ని దేశరక్షణకు వినియోగిస్తోంది. రాష్ట్రాలు మాత్రం ఓటుబ్యాంకును పెంచుకునే పథకాలకు వెచ్చిస్తున్నాయి.

చమురు స్వయంసమృద్ధిలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్న విమర్శలున్నాయి కదా?

అవన్నీ అవగాహన లేని విమర్శలు. పెట్రోలియం మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా కాకుండా సామాన్య పౌరుడిగానైతే నేనూ అలానే అనుకునేవాడినేమో. దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా నిధులను ఖర్చు చేస్తోంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రూ. వేల కోట్లు ఖర్చు చేసి ఇంధన నిల్వలు లేవని తెలుసుకున్న విషయాన్ని మునుపటి పాలకులు మర్చిపోయారేమో. ప్రస్తుతం అనుసరిస్తున్న సాంకేతికతతో అక్కడున్న నిల్వలు తెలుస్తున్నాయి. లాభసాటిగా ఉంటాయో లేదో అంచనా వేయగలుగుతున్నాం. చమురు బయటకు తీసే రిగ్గులను కూడా దిగుమతి చేసుకునే స్థితి నుంచి తయారు చేసుకునే స్థాయికి చేరుతున్నాం.

బీపీసీఎల్‌ విక్రయం, గెయిల్‌ పైప్‌లైన్ల ప్రైవేటీకరణపై ఏమంటారు?

ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. నగదీకరణ అంటే ప్రైవేటు వారికి ప్రభుత్వ ఆస్తులను గుండుగుత్తగా ఇవ్వటం కాదు. గడువు తరవాత వాటిని కేంద్రానికి అప్పగించాల్సిందే. అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీగా నూతన పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల్లో కొంత వెనక్కు తీసుకుని తిరిగి పెట్టుబడులు పెట్టేందుకే ఈ వ్యూహం.

ఇథనాల్‌, విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర చర్యలేమిటి?

ఆ రెండూ ఒక్కసారిగా చేసేవి కావు. ఇథనాల్‌ వినియోగాన్ని 30 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. విద్యుత్తు వాహనాల పెంపును ప్రోత్సహిస్తోంది. తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కొత్త విధానాలను తీసుకువస్తున్నాయి. వాహనాలన్నీ ఒక్కసారే మార్చేయమంటే ప్రజలపై భారం పడుతుంది. వాహన తయారీ సంస్థలు రూ. లక్షల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాయి? అందుకే కేంద్రం దశలవారీగా అమలు చేస్తోంది.

కరోనా సమయంలో తగ్గిన చమురు ధరలను కేంద్రం ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంది?

సాధారణ రోజుల్లో సైన్యం మినహా పౌరుల కోసం 20 రోజులకు సరిపడే నిల్వలే మన దగ్గర ఉండేవి. భారీగా నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవటం దురదృష్టకరం. కేవలం విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), మంగళూరు, పదూరు (కర్ణాటక)లలో మాత్రమే నిల్వ సదుపాయాలున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదలతో కేంద్రం వ్యూహాత్మకంగా నిల్వ కేంద్రాలను పూర్తిస్థాయిలో భర్తీ చేసింది. ప్రస్తుతం 74 రోజులకు సరిపోయేంత నిల్వలున్నాయి.

ఇదీ చూడండి:

ACCIDENT: బండారుపల్లిలో ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి

ABOUT THE AUTHOR

...view details