ఖరీఫ్ మొదలై మూడు వారాలు గడిచింది. నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కర్నూలు మినహా లోటు వర్షపాతమే ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పది రోజుల నుంచి చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు సగటున 73.8 మి.మీ వర్షం కురిసింది.
కోస్తాలోని కృష్ణా జిల్లాలో సాధారణం కంటే 42.1శాతం అధిక వర్షపాతం నమోదైంది. విజయనగరంలో 22.2 శాతం , తూర్పుగోదావరిలో 19.7 శాతం చొప్పున అధిక వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో వర్షపాతం సాధారణంగానే ఉంది.
చిత్తూరులో 64.7 మి.మీ వర్షం కురవాల్సిఉంటే.. ఆదివారానికి 14.5 మి.మీ మాత్రమే నమోదైంది. అనంతపురంలో 27.1 శాతం, కడపలో 23.5 శాతం తక్కువగా వానలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 46.9 శాతం అధికంగా వానలు పడ్డాయి.