ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే నియామకాల్లో క్రమంగా కోత.. క్లర్కు పోస్టుల భర్తీ చేపట్టొద్దని బోర్డు ఆదేశాలు

Railway recruitment: రైళ్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన విభాగాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లర్కులను నియమించకుండా చూడాలని డివిజన్‌ అధికారులను బోర్డు ఆదేశించింది.

railway recruitment problems
రైల్వే నియామకాల్లో క్రమంగా కోత

By

Published : Jul 25, 2022, 11:21 AM IST

Railway recruitment: రైళ్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన విభాగాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లర్కులను నియమించకుండా చూడాలని డివిజన్‌ అధికారులను బోర్డు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించి గ్యాంగ్‌మెన్లు, డీజిల్‌ షెడ్లలో కళాసీలను నియమిస్తున్నారు.

ఇతర విభాగాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి సంబంధించి ఖాళీలను భర్తీచేయకుండా పోస్టులను సరెండర్‌ చేయాలని కూడా బోర్డు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం డివిజన్‌లో ఆయా విభాగాల అధికారులు పోస్టుల సరెండర్‌కు పోటీపడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు రైల్వే డివిజన్‌లో దాదాపు 18 వేల మంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం 14,071 మంది పనిచేస్తున్నారు. అంటే సుమారు 2 వేల పోస్టులను అధికారులు సరెండర్‌ చేశారు. మరో 2 వేల మంది ఉద్యోగ విరమణ చేసినా.. పోస్టులను భర్తీచేయలేదు.

ప్రస్తుతం డివిజన్‌లో పర్సనల్‌, అకౌంట్స్‌, కమర్షియల్‌ తదితర విభాగాల్లో కంప్యూటరీకరణ దాదాపు పూర్తికావడంతో ఈ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని వేరుగా కాకుండా ఒకే కార్యాలయంలో పనిచేసేలా చూడాలని రైల్వే బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు, క్వార్టర్ల నిర్వహణ, రైల్వేకు చెందిన పార్సిల్‌ కార్యాలయాలు, గూడ్సు షెడ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు ఇప్పటికే డివిజన్‌లో డీజిల్‌ షెడ్లలో, రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటుకు అప్పగించారు. రైళ్లను నడపడం, రైల్వే ట్రాక్‌, కంట్రోల్‌ కార్యాలయం నిర్వహణ, భద్రతతో ముడిపడిన విభాగాలను మరింత పటిష్ఠపర్చాలని, భద్రతతో సంబంధం లేని విభాగాలను క్రమంగా తొలగించాలని రైల్వే బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:అంతర్రాష్ట్ర హంతక ముఠా అరెస్టు.. తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లు

ABOUT THE AUTHOR

...view details