తనను ఎంపీగా అనర్హుడిని చేయలేకనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానని ఓ పత్రిక రాసిన కథనంతో వారి క్రెడిబిలిటీ మరింత దిగజారిందని విమర్శించారు. తప్పుడు కథనాలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేయాలని ఆలోచిస్తే... ఇప్పటికే నమోదైన ఛార్జిషీట్లను తన న్యాయవాదులు చూపించారని తెలిపారు. ఎలాగూ మూడు నాలుగు నెలల్లో జైలుకు వెళ్లేవారిపై మరో కేసు వేయడం ఎందుకన్నారని చెప్పారు. బ్యాంకుల ద్వారా తనకు మంజూరైన మొత్తం రుణం నాలుగు వేల కోట్లలోపు మాత్రమేనని వెల్లడించారు. అందులో రెండు వేల కోట్లు తాను బ్యాంకు నుంచి ఇప్పటికీ డ్రా చేయలేదని అన్నారు.
తనపై కేసు నమోదైన 6వ తేదీనే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిశారని... అదే రోజున పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛైర్మన్ ముఖ్యమంత్రిని కలవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. వారిపై 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నందునే తనపై రూ.23 వేల కోట్లకు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
తనను బతిమిలాడి వైకాపాలోకి తీసుకొచ్చిన రెండో రోజే టిక్కెట్ ఇవ్వకుండా కుట్రపన్నారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ జోక్యంతోనే తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చారని వివరించారు. తితిదేలో యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కార్పొరేషన్ల పేరుతో బీసీల్లోనే వైషమ్యాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి బ్యాచ్‌మేట్ ద్వారా ఈ విచారణ వేయించగలిగారు. ఈ కేసు ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికీ బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ ప్రాజెక్టుల కోసం నాకు బ్యాంకుల నుంచి మంజూరు అయిందే నాలుగు వేల కోట్లు. ఇంకా చాలా నిధులు బ్యాంకుల నుంచి రాలేదు. రూ.826 కోట్లు ఖాతాలకు దారి మళ్లించానని చెప్తున్నారు. నా వ్యాపార లావాదేవీల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తా. నిధులు నేను తినేస్తే ప్రాజెక్టులు ఎవరు కడతారు. కోర్టుల దృష్టికి ఈ అంశాలను తీసుకు వెళ్తా. నాపై వచ్చే వార్తలకు కొద్దిమంది మాత్రమే సంతోషపడతారు. ముఖ్యమంత్రి దిల్లీ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారిని కలిసి నాపై ఎఫ్ఐఆర్ వేయించారు. -రఘురామకృష్ణరాజు
ఇదీ చదవండీ... సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా