ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్న రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా.. మ్యానిఫెస్టోలో ఆంగ్లమాధ్యమాన్ని చేర్చిన పార్టీ నిర్ణయం తప్పా.. లేక రాజ్యాంగ విలువలు కాపాడేందుకు పార్లమెంట్‌లో ప్రశ్నించిన నాది తప్పా.. అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ విజయసాయిరెడ్డి పదేపదే సభాపతిని కలవడంపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం జరిగినప్పుడు దిల్లీలో ఒకరోజు దీక్ష చేసిన సమయంలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వచ్చి సంఘీభావం తెలిపారని.. ఆ ఫొటో అడ్డంపెట్టుకుని మళ్లీ సభాపతికి ఫిర్యాదు చేయడం ఏంటని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నా అభిప్రాయాలు మా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఆలయాలపై దాడులు జరగకూడదు అనేది మా పార్టీ నిర్ణయం కాదా? నాపై అనర్హత వేటుకు కారణమేంటి? ఆలయాలపై దాడులను నిరసించడం మా పార్టీ విధానానికి వ్యతిరేకమా? మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే అనర్హత వేటు వేస్తారా?"- రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ